PM Modi Tour In AP: నేడు ఏపీకి రానున్న ప్రధాని మోదీ
PM Modi Arrive To Visakhapatanam Today: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ భువనేశ్వర్ కు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. రాత్రికి ఈస్ట్ నేవీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. కాగా ప్రధాని మోదీకి.. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు.
రేపు ఉదయం 6.30 గంటలకు విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. రేపు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగా ఆసనాలు వేయనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కాగా కార్యక్రమంలో 5 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పొరబాట్లు జరగకుండా ఘనంగా నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. కార్యక్రమంలో యోగాపై ప్రధాని మాట్లాడనున్నారు.
అనంతరం ఉదయం 7.50 గంటలకు బయల్దేరి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. ఉదయం 8.15 నుంచి 11.15 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11.25 ఏఎన్ఎస్ సర్కార్ పరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరనున్నారు.