AP Govt. releasing Prisoners: సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు!
AP government issues orders for release of Prisoners: రాష్ట్రవ్యాప్తంగా ఆయా జైళ్లలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం.. జైళ్లశాఖ ఎంపిక చేసిన 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితా రూపొందించింది. దాన్ని హోం శాఖ పరిశీలన అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2025 ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్ణీత సమయంలో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. జీవిత ఖైదీల మిగిలిన శిక్షను షరతులకు లోబడి రద్దు చేస్తున్నట్లు సర్కారు ఆదేశాల్లో పేర్కొంది. ఖైదీల ముందస్తు విడుదలకు రూ.50 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని షరతు విధించింది.
విడుదలైన తర్వాత ఖైదీలు శిక్ష పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. మూడు నెలలకోసారి ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని నిర్దేశించింది. విడుదలైన ఖైదీలు ఏదైనా నేరానికి పాల్పడితే తిరిగి అరెస్టు చేయాలని సర్కారు ఆదేశాల్లో స్పష్టం చేసింది.