Sharmila on YS Jagan: వైఎస్ జగన్ పల్నాడు పర్యటన.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila question on Jagans Palnadu Tour: మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వారిని జగన్ పరామర్శించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని నిలదీశారు. జగన్ ప్రజాసమస్యలపై పోరాటం చేయాలి కానీ, బల ప్రదర్శనలు కాదని సూచించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు అన్నారు. అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా దగ్గర ఉండి బలప్రదర్శనలు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేసే కాంగ్రెస్‌కు మాత్రమే ఆంక్షలు విధిస్తారని మండిపడ్డారు. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవు? ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పోరాటం చేస్తే హౌజ్ అరెస్ట్ చేస్తారా?..
తాము రాజధానిపై పోరాటం చేస్తే హౌజ్ అరెస్ట్ చేస్తారని ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పరామర్శల పేరుపై చేసే యాత్రలకు ఆంక్షలు ఉండవా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోదీ దత్త పుత్రుడు అన్నారు. జగన్ దగ్గర డబ్బులు ఉన్నాయని, పోలీసులను కొనగలడా అని మండిపడ్డారు. జగన్ పరామర్శలో ఇద్దరు చనిపోతే, దానికి బాధ్యులు ఎవరని చంద్రబాబును నిలదీశారు. 100 మందికి అనుమతి ఇస్తే వేలమంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. పోలీసులు ఎందుకు ఉన్నారని, ప్రేక్షక పాత్ర శాఖ ఎందుకు పోషించిందని ఆరోపించారు.
ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది?..
ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? అని ఆమె మండిపడ్డారు. వైఎస్ జగన్ రాకముందే వచ్చే జనాలను ఆపలేదు? అని ప్రశ్నించారు. మీరంతా బీజేపీ మద్దతుదారులే అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ నాయకుడిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్‌లో మృతిచెందిన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? అని నిలదీశారు. ప్రజానాయకుడిగా ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ ఏమైందని అడగాలన్నారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుపై ఉద్యమాలు చేయాలని హితవు పలికారు. ప్రత్యేక హోదా ఏమైందని అడగాలి తప్ప బలప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.