Last Updated:

TDP: నెల్లూరు జిల్లాలో టీడీపీ పుంజుకుంటుందా?

దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం వైసీపీ ఏర్ప‌డ్డాక జ‌గ‌న్ వెంట అడుగులు వేసిన నాయ‌కుల్లో నెల్లూరు జిల్లా నాయ‌కుల‌దే తొలిస్ధానం. క‌డ‌ప త‌ర్వాత నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోట‌గా పిలుచుకుంటారు.

TDP: నెల్లూరు జిల్లాలో టీడీపీ పుంజుకుంటుందా?

Nellore: దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం వైసీపీ ఏర్ప‌డ్డాక జ‌గ‌న్ వెంట అడుగులు వేసిన నాయ‌కుల్లో నెల్లూరు జిల్లా నాయ‌కుల‌దే తొలిస్ధానం. క‌డ‌ప త‌ర్వాత నెల్లూరు జిల్లాను వైసీపీకి కంచుకోట‌గా పిలుచుకుంటారు. 2014 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో 7 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుపొంద‌గా, మూడుస్థానాల‌కే టీడీపీ ప‌రిమిత‌మైంది. 2019 ఎన్నిక‌ల్లో ఏకంగా ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీ త‌మ ఖాతాలో వేసుకుని భారీ మెజార్టీ సాధించింది. దీంతో టీడీపీ ఓ ద‌శ‌లో నీరుగారిపోయింది. రాష్ట్ర నాయ‌క‌త్వం నుంచి మండ‌ల నాయ‌కుల వ‌ర‌కు ఎవ‌రు వైసీపీకి ఎదురు మాట్లాడే ప‌రిస్థితి లేదు. ఒక‌రిద్ద‌రు ముఖ్య‌నేత‌లు అప్పుడ‌ప్పుడూ మీడియా ఎదుట మాట్లాడినా వారికి వైసీపీ భారీ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో పాటు ఎదురుదాడికి దిగేది. దీంతో ఆయా నియోజ‌క‌వర్గాల్లో టీడీపీ పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది.

అయితే వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం త‌ర్వాత‌ నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్ లు సై అంటే సై అనేలా రంగంలోకి దిగారు. ప్ర‌త్యేకించి మాజీమంత్రి అనిల్‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిల‌ను టార్గెట్ గా చేసుకుని బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూప‌డంతో స‌క్సెస్ అయ్యారు. ముఖ్యంగా అనీల్ తో బాహాబాహీకి దిగేందుకు కూడా ఓ ద‌శ‌లో శ్రీనివాసుల‌రెడ్డి తొడ‌కొట్టారు. రూర‌ల్, సిటీ ప‌రిథిలోని అక్ర‌మ లే అవుట్లు, ఇసుక ర‌వాణా వంటి అంశాల్లో అజీజ్ బ‌హిరంగ స‌వాళ్లు విస‌ర‌డం, ఆయా లే ఔట్ల‌లో ప‌ర్య‌టించ‌డం వంటి కార్య‌క్ర‌మాలు త‌ర‌చూ చేస్తున్నారు. అయితో ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సిటీ, రూర‌ల్ ప‌రిధిలోని 54 డివిజ‌న్ల‌లో టీడీపీ ఓట‌మికి వీరిద్ద‌రే కార‌ణ‌మ‌నే ప్ర‌చారాన్ని హైలెట్ చేశారు వైసీపీ నేత‌లు. అందులో బాగంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నెల్లూరు జిల్లా నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో వీరిరువురికి క్లాస్ పీక‌డం, జిల్లా టీడీపీలోని రాష్ట్ర నేత‌ల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీ పుంజుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక మాజీ మంత్రి నారాయ‌ణ తెర‌మ‌రుగ‌య్యారు. ఎక్క‌డా ఎలాంటి కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొన‌లేదు. ఇటీవ‌ల ఆయ‌న అరెస్ట్ త‌ర్వాత తిరిగి సిటీలో కొన్ని ప్రైవేట్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీదా ర‌విచంద్ర జిల్లాలోని టీడీపీ నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ముందుకు తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ద్య స‌యోద్య లేక‌పోవ‌డం కొంచెం క‌ష్ట‌త‌రంగా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల టీడీపీని జిల్లాలో ప‌టిష్టం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పొద‌ల‌కూరులో ఓ ద‌ళిత వ్య‌క్తి నారాయ‌ణ ఆత్మ‌హ‌త్య‌కు పోలీసులే కార‌ణ‌మ‌ని చేసిన పోరాటంలో స‌క్సెస్ అయ్యారు .ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఆ కుటుంబానికి అండ‌గా నిల‌వ‌డంతో పాటు పోలీసుల‌తో పోరాడారు. నారాయ‌ణ భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగంతో పాటుగా స్థలం, ఆర్ధిక సాయం అందేలా చేశారు. ఇటీవ‌ల కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల వేధింపుల‌తో క‌రుణాక‌ర్ అనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంతో ఆ అంశాన్ని కూడా టీడీపీ పూర్తిగా త‌మ‌వైపు తిప్పుకుంది. కుటుంబానికి అండ‌గా నిల‌వ‌డం, న్యాయ‌పోరాటం చేయ‌డం, రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని జిల్లాకి తీసుకురావ‌డం వంటి అంశాల్లో సోమిరెడ్డి, బీదా ర‌విచంద్ర‌లు కీల‌క పాత్ర చేప‌ట్టారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు న‌గ‌రంలో కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి, రూర‌ల్ లో అజీజ్‌, స‌ర్వేప‌ల్లిలో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, గూడూరులో పాశిం సునీల్ కుమార్ లు మిన‌హా మిగిలిన చోట్ల టీడీపీ నేత‌లు తూతూ మంత్రంగా ప‌నిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో సుబ్బానాయుడికి ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో పార్టీని ముందుకుతీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరుతోంది. దీన్ని ప‌రిష్క‌రించేందుకు బీదా ర‌విచంద్ర వేయ‌ని అడుగు లేదు. ఇక కోవూరులో పోలంరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్ప పెద్ద‌గా కార్య‌క్ర‌మాలు చేయ‌డం లేదని టీడీపీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కోవూరులో చేజ‌ర్ల వెంక‌టేశ్వ‌ర్లు రెడ్డి, పెళ్ల‌కూరు శ్రీనివాసుల‌రెడ్డి వ‌ర్గాలు బలంగా ఉన్నాయి. ఆత్మ‌కూరులో నాయ‌క‌త్వం పూర్తిగా ప‌డిపోయింది. ఈ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీపై ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కుమార్తె కైవ‌ల్యారెడ్డి క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. త‌న మెట్టినింటి త‌ర‌పున టీడీపీ టికెట్ ఈ సారి ఆమెకే వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో ఇప్ప‌టి నుంచే నేత‌ల‌తో స‌న్నాహాలు మొద‌లెట్టార‌ని టాక్‌. ఉద‌య‌గిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. వెంక‌ట‌గిరిలో కురుగొండ్ల నామ‌మాత్ర‌పు కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సూళ్లూరుపేటలో కార్య‌క‌ర్త‌ల‌ను న‌డిపించే నాయ‌కుడే క‌రువ‌య్యారు. నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే యాక్టివ్ కార్య‌క్రమాలు జ‌రుగుతున్నాయి.

2024 ఎన్నిక‌లు టీడీపీకి డూ ఆర్ డై అంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఆ సంద‌ర్భంలో అన్ని జిల్లాల‌పై ద్రుష్టిపెట్టిన చంద్ర‌బాబు నెల్లూరు నేత‌ల‌కు ఫుల్ క్లాస్ పీకార‌ట‌. అయితే నేత‌లు వైసీపీకి ఎదుర్కోవ‌డంలో కొన్ని చోట్ల స‌ఫ‌ల‌మ‌వుతున్నా, మ‌రికొన్ని చోట్ల విఫ‌ల‌మ‌వుతున్నార‌ని టాక్‌. ఓ ద‌శ‌లో వైసీపీని టార్గెట్ చేయడానికి టీడీపీకి ఆ చాన్స్ వైసీపీ నేత‌లే ఇస్తున్నార‌ట‌. వైసీపీలో వ‌ర్గ‌పోరు నేప‌ధ్యంలో అంత‌ర్గ‌త విబేధాలు, అవినీతి అంశాల‌ను ఆయా నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌ల‌కు ర‌హ‌స్యంగా చేర‌వేస్తుండ‌డంతో వారు గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నిక‌ల్లో సిటీ నుంచి నారాయ‌ణ ఖ‌చ్చితంగా పోటీచేస్తార‌ని నాయకుల టాక్‌. జిల్లా టీడీపీ నేత‌లంతా అత్యంత త్వ‌ర‌లో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. సోమిరెడ్డి, బీదార‌విచంద్ర‌తో పాటు నారాయ‌ణ కూడా టీడీపీ ప‌టిష్ట‌త కోసం కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. మొత్తానికి ఈ జిల్లాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి: