Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. అసలు కారణమిదే!
Vaikuntha Ekadashi 2025: తెలంగాణతో పాటు ఏపీలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచే పలు ఆలయాలను ముస్తాబు చేశారు. ఇప్పటికే ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కోసం అవకాశం కల్పిస్తారు.
అయితే, వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులకు నమ్మకం ఉంటుంది. అందుకే వైకుంఠ ఏకాదశి పుణ్య రోజున భక్తులు వైష్ణవ దేవాలయాలకు తరలివెళ్తుంటారు. ఇందులో భాగంగానే తిరుమలలో శ్రీవారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహిస్తారు.
కాగా, ఏకాదశి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ముర అనే రాక్షసుడితో పీడింపబడే దేవతలంతా మహావిష్ణువును ప్రార్థిస్తారు. ఈ నేపథ్యంలో మహా విష్ణువు మురతో యుద్ధం చేస్తూ ఆయన సింహవతి అనే గుహలోకి ప్రవేశిస్తాడు. దీంతో స్వామి శక్తి నుంచి ఏకాదశి అనే స్త్రీ ఉద్భవించి మురను సంహరిస్తుంది.
ఇందులో భాగంగానే మహా విష్ణువు సంతోషం వ్యక్తం చేశాడు. అనంతరం ఏం వరం కావాలో కోరుకోవాలని అడుగుతాడు. దీనికి ఆమె ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలిగించమని కోరుకుంటుంది. దీంతో స్వామి తథాస్తు అనడంతో పాటు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలా వైకుంఠ ఏకాదశిగా మారిందని చెబుతుంటారు.