Last Updated:

World Day of War Orphans: యుద్ధంలో సమిధలై పోతున్న బాలలు..!

World Day of War Orphans: యుద్ధంలో సమిధలై పోతున్న బాలలు..!

World Day of War Orphans 2025: యుద్ధం కొందరికి వ్యాపారం. మరికొందరికి ప్రతిష్ఠ. ఇంకొందరికి ఇది అవసరం. కొద్ది మందికి ఇది.. ఒక పెద్ద సరదా. కారణాలేమైనా యుద్ధాల వల్ల మానవాళికి జరుగుతున్న నష్టం అపారం. నాటి కురుక్షేత్రం నుంచి నేటి ఇజ్రాయిల్- పాలస్తీనా యుద్ధం వరకు జరిగిన యుద్ధాల్లో ఎవరు విజేతలు, పరాజితులయ్యారో తెలియదు గానీ, వీటన్నింటికీ అసలు కారణంగా ఉన్నది మాత్రం మనిషి మితిమీరిన స్వార్థమే. అలాగే, యుద్ధం ఏదైనా.. దాని గురించి ప్రపంచానికి తెలిసేది సగమే. యుద్ధం కారణంగా అనాథలైన వారి ఆక్రందనలు, యుద్ధం వల్ల సర్వమూ కోల్పోయి వలస బాట పట్టిన అభాగ్యులు ఆవేదన, యుద్ధం వల్ల వికలాంగులై బతుకంతా మరొకరిమీద ఆధారపడి బతికే బడుగుల వెతలు ఏ చరిత్రకూ ఎక్కవు. యుద్ధం వల్ల అనాథలైన చిన్నారుల గాధలైతే.. అనవసరపు విషయాలుగా మిగిలిపోతాయి. వీరంతా ఓ వయసు వచ్చే వరకు శరణార్ది శిబిరాల్లో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. అలాంటి అభాగ్యుల కోసం ఫ్రాన్స్‌లోని ‘ఎస్‌ఓఎస్‌ ఎన్‌ఫాంట్స్‌ ఎన్‌ డెట్రెసెస్‌’అనే స్వచ్ఛందసంస్థ చొరవతో యూనిసెఫ్‌ ఏటా జనవరి 6న ‘వరల్డ్‌ డే ఆఫ్‌ వార్‌ ఆర్ఫన్స్‌ డే’గా నిర్వహిస్తోంది. యుద్దాల కారణంగా అనాథలుగా మారిన పిల్లలకు.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎదురయ్యే సామాజిక, మానసిక, శారీరక, సాంస్కృతిక సమస్యలను ప్రపంచం దృష్టికి తెచ్చి, భవిష్యత్తులో యుద్ధోన్మాదాన్ని తగ్గించాలనేదే యూనిసెఫ్ ఆకాంక్ష. ‘నియంత్రణ లేకుండా సాగుతున్న యుద్ధాల మూలంగా ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు అనుక్షణం మృత్యువుతో పోరాడుతున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది అమానుషం’ అని యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్‌ రస్సెల్‌ వాపోయారు.

రెండో ప్రపంచయుద్ధం వంటి దారుణ యుద్ధం ఈ పుడమి మీద జరగలేదంటే అతిశయోక్తి కాదు. 1940నాటికి ప్రపంచ జనాభా 230 కోట్లు కాగా, ఈ యుద్ధం వల్ల ఎనిమిదిన్నర కోట్లమంది అమాయక ప్రజలు మరణించారు. యుద్ధకారణంగా వ్యాపించిన అంటురోగాలవల్ల, కరవుకాటకాల వల్ల మరో 5.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లోనే పోలాండ్‌లో 3 లక్షలు, యుగోస్లోవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలైపోగా, పలు ఇతర దేశాల్లోనూ ఇదే సంఖ్యలో చిన్నారులు బాధితులుగా మిగిలారు. ఒక్క జర్మన్ నాజీల చేతిలోనే కోటిన్నర మంది యూదు బాలలు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో వేల సంఖ్యలో రొమానీ (జీప్సీ) బాలలను నాజీలు అంతమొందించారు. సుమారు ఏడువేల మంది జర్మన్‌ బాలలు శారీరక, మానసిక వైకల్యాలతో ఆవాసకేంద్రాలకు చేరి అకాల వృద్ధులుగా గడిపారు. ఏన్‌ మేరీ ఫ్రాంక్‌ అనే యూదు బాలిక రాసిన డైరీ బాలల జీవితంలో యుద్ధం కలిగించే కల్లోలానికి అక్షరరూపమిచ్చినా,నేటికీ యుద్ధోన్మాదం కొనసాగుతూనే ఉంది. బాల్యాలు బేలవై బిక్కచూపులు చూస్తూనే ఉన్నాయి.

ఇక వర్తమానానికి వస్తే.. 2022 ఫిబ్రవరి మూడో నాలుగోవారంలో రష్యా సేనలు ఉక్రెయిన్ మీద దాడి ప్రారంభించాయి. సుమారుగా మూడేళ్లుగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉన్న ఉక్రెయిన్‌ తర్వాత స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అయినా రెండు దేశాల మధ్య రాకపోకలు సాఫీగా సాగుతూనే ఉన్నాయి. కానీ, ఈ యుద్దం వల్ల పొరుగుదేశాలకు పోయిన వారు మూడేళ్లుగా అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్‌ నుంచి 65 లక్షల మంది పొరుగుదేశాలు పట్టిపోగా, 80 లక్షల మంది దేశంలోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఈ ఘర్షణలో మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా 2 లక్షల మంది చిన్నారులు అనాథలుగా మారారు. ఇంకా సంక్షుభిత పరిస్థితుల్లో వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్‌ఫ్లిక్ట్‌ అబ్జర్వేటరీ సంస్థ చెబుతోంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్‌ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడటంతో.. వేలాది మరణాలు సంభవించగా, లక్షలాది మంది వలసపోతున్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో 16 నెలల్లో కనీసం 19 వేల మంది బాలలు మరణించగా 2 వేల మంది అనాథలైపోయారు.

యునిసెఫ్‌ లెక్కల ప్రకారం.. ప్రపంచ జనాభాలో 30 శాతం పిల్లలే. యూనిసెఫ్ 2024 గణాంకాల ప్రకారం నేడు ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 47.4 కోట్ల మందికిపైగా చిన్నారులు జీవిస్తున్నారు. వీరిలో ప్రతి ఆరుగురిలో ఒకరు తీవ్ర కల్లోల పరిస్థిలో బతుకుపోరాటం చేస్తున్నారు. ఈ మొత్తం పిల్లలో సగానికి కంటే పైబడిన వారు తిండి, బట్ట, నీడ కోసం తిప్పలు పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయిన అనాథలే. సుమారు 6 కోట్ల మంది అనాథ బాలలు ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంత దేశాల్లో ఉన్నారు. యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో, ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది. సూడాన్‌లోని ప్రతి 100 మంది పిల్లల్లో 10మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. నేడు సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 లక్షల చిన్నారులు బడికి దూరమై, పోషకాహారలోపంలో చిక్కి శల్యమైపోతున్నారు. వీరిలో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబాన్ని కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ, ఆగ్రహావేశాలు, విచారం, భయం వంటివి పెరిగి తెగిన గాలిపటాలై పోతున్నారు. బాలురతో పోల్చితే బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లోని బాలికలు అత్యాచారాలు, లైంగిక హింసకు గురవుతున్నారు.

రష్యన్ పసికందైనా, ఉక్రెయిన్‌ చిన్నారైనా, ఇజ్రాయిల్‌ నవజాత శిశువైనా, గాజా చిన్నారైనా తాగేది అమ్మపాలే. లోకంలో ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే సర్వస్వం. ఒక వయసు వచ్చి, చదువుకో, కొలువుకో పరాయిగడ్డకు చేరినా.. పిల్లలు తల్లడిల్లేది అమ్మానాన్నల గురించే. అమ్మ ఒడిలో, నాన్న చెంతకు వారికి దొరికే రిలీఫ్ మరెక్కడా ఉండదు. అలాంటి చిన్నారులు.. బాల్యంలోనే యుద్ధం మూలంగా తల్లినో, తండ్రినో లేక ఇద్దరినో కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతూనే ఉన్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి. కనీసం కొత్త ఏడాదిలోనైనా ఈ యుద్ధోన్మాదం తగ్గి, శాంతి పవనాలు వీస్తే, బిక్కుబిక్కుమంటూ బతుకులీడుస్తున్న కోట్లాది బాలల జీవితాలలో కొంతైనా శాంతి నెలకొంటుంది.