Ocean Pollution: కడలి కడుపుకోతతో కల్లోలమే..!
![Ocean Pollution: కడలి కడుపుకోతతో కల్లోలమే..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/OCEAN.jpg)
Conservation International mission care for ocean: మానవజీవన పరిణామం ఆరంభమైన నాటి నుంచి మనిషికి, సముద్రానికి చెప్పలేని ఒక అవినాభావ సంబంధముంది. సముద్రాలు భూమ్మీది పలు దేశాలను కలిపే జలమార్గాలుగానే గాక, మానవుడి ఉనికిని భౌతికంగా, ఆర్థికంగా నిలిపే గొప్ప వనరులుగా అనాదిగా నిలుస్తూ వస్తున్నాయి. పృధివిని ఆవరించిన మహాసముద్రాలన్నింటినీ కలిపి ఒక దేశం అనుకుంటే.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచపు ఏడవ అతిపెద్దదిగా నిలుస్తుందని గతంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 809 కోట్ల మానవ జనాభాలో 300 కోట్ల మంది జీవికకు సాగరాలే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అండగా నిలుస్తున్నాయంటే ఆశ్చర్యం అనిపించకమానదు. భూఉపరితలంపై 71 శాతానికి పైగా ఉన్న మహాసముద్రాల వైశాల్యం 86.1 కోట్ల చదరపు కిలోమీటర్లు కాగా, భూగ్రహం మీద ఉన్న మొత్తం జలవనరుల్లో 97 శాతం సముద్రజలాలే. అలాగే, భూమ్మీద జీవించే మానవులతో బాటు జీవించే వేల కోట్ల జీవరాసులలో 99 శాతం జీవులకు సముద్రాలే ఆలంబనగా నిలుస్తున్నాయి. ప్రాణవాయువు ఉన్న ఏకైక గ్రహమైన భూమి మీద జీవించే ప్రాణులకు అవసరమైన సగం ప్రాణవాయువునూ అందించే సాగరాలే, భూమ్మీద విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌లో నాలుగోవంతును గ్రహిస్తున్నాయంటే నమ్మాల్సిందే. సకాలంలో వర్షాలు, రుతువులకు తగిన వాతావరణం మార్పులకు కూడా మహా సముద్రాలే ప్రధాన ఆధారం. ఇలా.. మనిషి మనుగడకు ఎన్నో రకాలుగా అండగా నిలిచే సముద్రాలు ఏటికేడు కాలుష్య కాసారాలుగా మారి తమ సహజత్వాన్ని, వైవిధ్యాన్ని కోల్పోతున్నాయి. సముద్రం ఇచ్చే ఉప్పు తింటున్న మానవుడు.. ఆ రుణం తీర్చుకోవటానికి బదులు తన స్వార్థం కోసం ఆ సముద్రాన్నే ముంచేస్తూ.. ఈ క్రమంలో తెలియకుండానే తానూ స్వీయ వినాశనం దిశగా అడుగులు వేస్తున్నాడు.
మానవుడు తొలి నాళ్లలో తన ఆహారం కోసం సముద్రాన్ని ఆశ్రయించాడు. కాలం మారేకొద్దే ఆ అపార జలనిధిని సంపదగా మార్చుకోవటం మొదలుపెట్టాడు. ఇలా, కాలంతో బాటు పెరుగుతూ వచ్చిన మనిషి స్వార్థం, నిర్లక్ష్యం నేడు సముద్ర కాలుష్యానికి కారణమైంది. ఈ క్రమంలో ఆ సాగర జలాల్లో నివసించే లక్షలాది ప్రాణికోటి ఉనికి ప్రమాదంలో పడుతోంది. ఇదే మాటను శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా.. మనిషి దీనిని నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నాడు. మహా సముద్రాలు మన భూమికి ఊపిరితిత్తులని గుర్తిస్తూనే, ఆ ఊపిరితిత్తులకు ఎప్పటికప్పుడు కొత్త తూట్లు పొడుస్తూనే వస్తున్నాడు. దీంతో వేడెక్కుతున్న భూగోళం మీద సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. గత 30 ఏళ్లలో సముద్ర మట్టాలు సగటున 9.4 సెంటీమీటర్ల మేర పెరగగా, పసిఫిక్ ప్రాంతంలో ఇది 15 సెంటీమీటర్లుగా ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. భూమ్మీద 80 శాతం కాలుష్యానికి కారణమవుతున్న జీ 20 దేశాలు సాగరాల పరిరక్షణకు ముందుకు రావాలని సమితి పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా.. ఆయా దేశాల స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.
ఇక.. మహా సముద్రాల ఉసురు తీస్తున్న వాటిలో ప్లాస్టిక్ ముందు వరుసలో ఉంది. భూమిపై ఏటా సుమారు 3.6 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతుండగా, అందులో నాలుగోవంతు సముద్రాలకు చేరుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని భూమిచుట్టూ ఒక రోడ్డులా పేర్చితే, నాలుగుసార్లు భూమి చుట్టూ తిరగొచ్చని ఒక అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్, చైనాలు ముందువరసలో ఉన్నాయి. మన దేశంలో సాలీనా ప్లాస్టిక్ వినియోగం 15 మిలియన్ టన్నులు కాగా 2050 నాటికి ఇది 20 మిలియన్ టన్నులు అవుతుందని అంచనా. నేలలో కలసిపోవటానికే వందల ఏళ్లు పట్టే ఈ ప్లాస్టిక్ సాగరజలాల్లో చేరి ఏటా లక్షలాది జలజీవాలు, పక్షుల ఉసురు తీస్తోంది. రాబోయే దశాబ్ద కాలంలో సముద్రాల్లో చేరనున్న ప్లాస్టిక్ నాలుగురెట్ల మేర పెరగనుందని శాస్త్రవేత్తల అంచనా. ఇదిలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి మన సముద్రాలలో ప్లాస్టిక్, చేపల నిష్పత్తి 1:3గా మారబోతోందని, 2054 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ సంచులే ఎక్కువ వుంటాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సముద్రాల్లోకి చేరుతున్న రసాయన వ్యర్థాల వల్ల 5 రకాల జీవరాశులు శాశ్వతంగా అంతరించిపోగా, 2.45 లక్షల చదరపు కిలోమీటర్ల మేర జలచరాలు జీవించలేని వాతావరణం ఏర్పడిపోయిందని వారు వాపోతున్నారు.
ఇప్పుడున్న రీతిలోనే కాలుష్యం కొనసాగితే గ్లోబల్ వార్మింగ్ మూలంగా వచ్చే రెండు దశాబ్దాలలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్షియస్ మేర పెరిగి హిమానీ నదాలు వేగంగా కరుగుతాయని నాసా అంచనా వేసింది. అదే గనుక జరిగితే, ఈ ప్రాంతంలోని సముద్రమట్టాలు ఏటా 3.7 మి.మీ చొప్పున పెరుగుతాయిని, ఈ విపరిణామంతో 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని నాసా అంచనా వేసింది. మన దేశంలో హిందూమహా సముద్ర తీర రేఖ వెంట ఉన్న విశాఖపట్నం, ముంబయి, చెన్నై, మంగుళూరు, కొచ్చి, పారాదీప్, మర్మగావ్, భావ్ నగర్, కాండ్లా, తూత్తుకుడితో సహా మరో నగరాలు మాయం కానున్నాయనీ నాసా హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం శుద్ధి చేయని డ్రైనేజీ నీరు సముద్రాలలో కలుస్తోందని, దీనివల్ల కలిగే వాతావరణ మార్పువల్ల ఏటా 13 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని యుఎన్‌ఇపి అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సుమారు 7500 కి.మీ పొడవైన తీర రేఖను కలిగిన, ప్రపంచపు అత్యధిక జనాభాకు ప్రాతినిథ్యం వహించే భారత్.. సాగర పరిరక్షణకు ముందుకు రావాలని నాసా సూచిస్తోంది. లేకుంటే రాబోయే రోజుల్లో తీరప్రాంతంలోని మత్య్యకారులు, రైతాంగం, సముద్రాల మీద ఆధారపడిన టూరిజం వంటి రంగాలన్నీ కుదేలై దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.
సాధారణంగా భూతాపం కారణంగా సముద్రాల్లోని నీరు ఆవిరిగా మారి, మేఘాలుగా ఏర్పడి, వాతావరణం చల్లబడగానే వర్షంగా మారుతుంది. కానీ, కాలుష్యం కారణంగా మేఘాలు ఏర్పడినా, వాతావరణం చల్లబడటం లేదు. దీనికారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, పొలాలు బీళ్లుబారి, కరువు ఏర్పడుతోంది. మరోవైపు సముద్రాలను ఆనుకుని ఉండే మడ అడవులు నాశనమై పోతున్నాయి. గత 60 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మడ అడవుల్లో 80 శాతం అంతరించిపోగా, కేవలం మడ అడవుల్లో మాత్రమే జీవించే 70 రకాల అరుదైన జీవజాతుల్లో 11 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయని ‘కన్జర్వేషన్ ఇంటర్నేషనల్’సంస్థ తన నివేదికలో హెచ్చరించింది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తున్నా.. మన ఆలోచనలో ఏమాత్రం మార్పురావటం లేదు. జలధి, జీవకోటికి మధ్యగల సంబంధాన్ని తాత్కాలిక సౌకర్యం, ప్రయోజనం కోసం విస్మరించటమంటే.. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనని, ఇకనైనా మేలుకొని మహా సముద్రాలను కాపాడుకోకపోతే మిగిలేది మహా విషాదమేనని మనమంతా గుర్తించినప్పుడే ఆ చల్లని సముద్ర గర్భం మానవాళికి అమ్మగా మారి కాపాడుతుంది.