Published On:

Sharwa 38: శతమానంభవతి జోడీ రిపీట్.. ఈసారి కూడా హిట్ పక్కా.. ?

Sharwa 38: శతమానంభవతి జోడీ రిపీట్.. ఈసారి కూడా హిట్ పక్కా.. ?

Sharwa 38: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు. మనమే సినిమాతో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా.. దీని తరువాత నారి నారి నడుమ మురారి అంటూ ఒక కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కాకముందే మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఇటీవలే ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించలేకపోయాడు డైరెక్టర్ సంపత్ నంది. అంతా బాగానే చేసినా.. అభిమానులు మాత్రం ఆ సినిమాను అంతగా ఆదరించలేదు.

 

అయినా అధైర్య పడకుండా.. మరో కొత్త కథతో శర్వానంద్ ను ఒప్పించి సినిమాను పట్టలెక్కించాడు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా  పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎప్పటినుంచో ఈ చిత్రంలో శర్వా  సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇక ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లోకి అనుపమను ఆహ్వానిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు.

 

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక శర్వా, అనుపమ జంట సూపర్ హిట్ కాంబో. వీరిద్దరూ కలిసి శతమానం భవతి సినిమాలో కలిసి నటించారు. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా జాతీయ అవార్డును అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బావమరదలు గా శర్వా, అనుపమ నటించారు. ఇక ఇప్పటికీ ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

 

ఇక శర్వా 38 లోకి అనుపమ ఎంట్రీ ఇచ్చిందని తెలియగానే ఫ్యాన్స్ ఈ సినిమా కూడా పక్కా హిట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే 15 ఎకరాల్లో భారీ సెట్ వేశారని, అక్కడే కొన్ని రోజులు షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ జంట మరో జాతీయ అవార్డును అందుకుంటారేమో చూడాలి.