Last Updated:

Amitabh Bachchan: ‘డబ్బులు కట్టాను.. దయచేసి నా పేరుకు బ్లూ బ్యాడ్జ్ ఇవ్వండి’

పలువురు ప్రముఖులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.

Amitabh Bachchan: ‘డబ్బులు కట్టాను.. దయచేసి నా పేరుకు బ్లూ బ్యాడ్జ్ ఇవ్వండి’

Amitabh Bachchan: ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విటర్ లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్ ’ లోనూ మార్పులు చేసిన విషయం తెలిసిందే. బ్లూ టిక్స్ కోసం ఎలన్ మస్క్ చార్జీలను ప్రవేశపెట్టారు. ఆ చార్జీలు చెల్లించని వారికి వెరిఫికేషన్ మార్క్ ను తీసేస్తామని గతంలో వెల్లడించారు కూడా. తాజాగా ఎలాన్ మస్క్ అన్నంత పని చేశారు. బ్లూ ట్రిక్ ను వెరిఫికేషన్ ప్రక్రియను గురువారం నుంచి అమలులోకి తేవడంతో .. చార్జీలు చెల్లించని వారు బ్లూ టిక్ కోల్పోవాల్సి వచ్చింది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా, రాజకీయ రంగాలను చెందిన పలువురు ప్రముఖలు అకౌంట్స్ కు వెరిఫికేషన్ టిక్ తొలగించింది. ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే ఈ బ్లూ టిక్ మార్కులను కొనసాగించనుంది.

 

వైరల్ గా అమితాబ్ ట్వీట్(Amitabh Bachchan)

దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే..‘ హేయ్ ట్విటర్ వింటున్నావా? నేను బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ కోసం నగదు చెల్లించాను. దయచేసి నా పేరుకు బ్లూ బ్యాడ్జ్ ను తిరిగి ఇవ్వండి. దాంతో నేనే అమితాబ్ బచ్చన్ అని అందరికీ తెలుస్తుంది. చేతులు జోడించి మీకు విజ్ఢప్తి చేస్తున్నాను. లేదంటే మీ కాళ్లపై పడి మొక్కమంటారా? అని బిగ్ బి ట్వీట్ చేశారు. కాగా, అమితాబ్ ట్వీట్ చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘బ్లూ టిక్ కోసం కొన్ని రోజులు ఆగాల్సిందే’.. ‘బచ్చన్ సాబ్.. మస్క్ విదేశీయుడు.. ఆయన ఎవరి మాట వినడు’అంటూ రిట్వీట్స్ చేస్తున్నారు.

 

 

ఇప్పటికి ఇదే నా వెరిఫికేషన్

అదే విధంగా బ్లూ టిక్ తీసివేయడంపై సచిన్ టెండూల్కర్, ప్రకాశ్ రాజ్ లు సైతం తమ స్పందన తెలియజేశారు. ‘ఇప్పటికి ఇదే నా బ్లూ టిక్ వెరిఫికేషన్..’ అంటూ చేతితో స్మైలీ సింబల్ లను చూపిస్తున్న ఫోటోను సచిన్ ట్వీట్ చేయగా.. ‘ బైబై ట్లూ టిక్ ..ఇన్ని రోజులు నిన్ను పొందినందుకు సంతోషం. ఇకపై కూడా ప్రజలతో నా ప్రయాణం ఎప్పటిలానే కొనసాగుతుంది’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌కు నగదు చెల్లించినా.. తమ ఖాతాకు వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ తీసేశారని ఇంకొందరు ట్వీట్లు చేశారు.