Last Updated:

AP GIS 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్

AP GIS 2023: రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి సహకారం ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. గడిచిన మూడెళ్లలో ఏపీ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని.. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని అన్నారు.

AP GIS 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్

AP GIS 2023: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. ఈ రెండు రోజుల సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వివరించింది. 15 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని సీఎం అన్నారు. ఈ సదస్సును విజయవంతం అయిందని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.

పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం (AP GIS 2023)

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి సహకారం ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. గడిచిన మూడెళ్లలో ఏపీ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని.. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. కీలక రంగాల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. రెండు రోజుల సదస్సులో మెుత్తం 352 అవగాహన ఒప్పందాలు జరిగాయని.. మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని జగన్ అన్నారు.

కీలక సమయంలో సదస్సు నిర్వహించాం

రెండు రోజు ముగింపు సభలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధి చెందేందుకు తాము సహకారం అందిస్తామని సీఎం అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఆర్థిక వ్యవస్థను శర వేగంతో పుంజుకునేలా చేశామని తెలిపారు. కోవిడ్‌ కాలంలో కూడా.. అనేక రంగాలకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులను సాకారం చేయడం.. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పారిశ్రామిక వేత్తలు త్వరగా ప్రయాణాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు. పెట్టుబడిదారులకు మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఏపీలో ఉంటుందని స్పష్టం చేశారు.

ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహకారం: కిషన్‌రెడ్డి

రెండో రోజు ముగింపు సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపై ప్రశంసలు కురిపించారు. ఏపీలో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొదువ లేదని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధికి ప్రభుత్వం కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. దేశంలో అంతర్జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోంది. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది. నూతన భారత నిర్మాణం వేగంగా జరుగుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందుతోంది. గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పెరిగాయి. ఏపీతో పాటు దేశాభివృద్ధికి సహకరిస్తున్న పెట్టుబడిదారులకు అభినందనలు. సమాఖ్య స్ఫూర్తితో ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహకారం అందిస్తాం అని కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

352 ఎంఓయూలు.. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు

రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. ఈ పెట్టుబడుల్లో అత్యధికంగా ఎనర్జీ రంగంలో వచ్చాయి. ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ.8.84 లక్షల పెట్టుబడులు వచ్చాయి. ఈ రంగంలో 40 అవగాహనా ఒప్పందాలు జరిగాయి. ఐటీ రంగంలో 56 ఒప్పందాలు జరిగాయి.

ధన్యవాదాలు తెలిపిన జగన్..

జీఐఎస్‌ సదస్సు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వల్ల 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. పెట్టుబడులను సాకారం చేసేందుకు మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు దిశగా కృషి చేస్తుంది.