PUBG On Railway Track: తీవ్ర విషాదం.. రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ.. ముగ్గురు యువకుల మృతి
Three Teens Killed While Playing PUBG On Railway Tracks in bihar: బీహార్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్నా నగరంలో పబ్జీ గేమ్ మూడు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన పట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగింది. చంపారన్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్, ముజఫర్ పూర్ రైల్వే మార్గంలో ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్సాతోలాలోని రాయల్ పాఠశాల సమీపంలో పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతున్నారు. ఈ సమయంలో అదే పట్టాలపై వస్తున్న రైలును గుర్తించలేకపోయారు. పబ్జీ ఆటలో నిమగ్నమైన ఆ యువకులకు రైలు కూత కూడా వినిపించకపోవడంతో వారిపై నుంచి రైలు తూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న అనంతరం మృతదేహాలను పరిశీలించారు. కాగా, ఆ యువకులు చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పబ్జీ గేమ్ ఆడుతున్నట్లు, అందుకే రైలు అదే పట్టాలపై వస్తున్న విషయాన్ని ఆ యువకులు గుర్తించలేకపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీలుగా గుర్తించారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ దీప్ తెలిపారు. ఆన్ లైన్ గేమ్స్ పేరిట యువత ప్రమాదాల బారీన పడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. అనంతరం పలు సూచనలు, సలహాలు అందించారు. పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ పై పర్యవేక్షించాలని సూచించారు. లేని సమక్షంలో ఇలాంటి దుర్ఠటనలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందారు.