Ponguleti Srinivasa Reddy: పేదలకు తీపి కబురు.. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇండ్లు
Ponguleti Srinivasa Reddy says Special App For Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 5న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను ప్రారంభించబోతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారులకు రూపాయి ఇవ్వాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం పేదోళ్లను మర్చిపోయిందని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారికి ఇండ్లు ఇస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు..
ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.3 వేల కోట్లను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను సైతం నియమించినట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్లపాటు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ కొనసాగుతోందన్నారు.
నమ్మి రాజ్యం అప్పగిస్తే కొల్లగొట్టారు..
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ప్రజలు పదేళ్ల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని మంత్రి తెలిపారు. మాయమాటలు నమ్మి రాజ్యం అప్పగిస్తే గత పాలకులు సంపద కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. వరి వేస్తే ఉరి అని బీఆర్ ఎస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇచ్చిందన్నారు.
ఎన్నికల్లో హామీ…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీనిచ్చింది. ఖాళీ జాగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జాగాలేని వారికి జాగాతోపాటు రూ. 5లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.