Harish Rao Thanneeru: రైతుబంధును శాశ్వతంగా బొందపెట్టే కుట్ర.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
Former minister Tanniru Harish Rao Fire on revanthreddy: రైతుబంధును రూపుమాపే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. రైతుబంధు కంటే సన్నాలకు ఇచ్చే రూ.500 బోనస్ మేలని రైతులు చెబుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్నలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ.26 కోట్లు మాత్రమేనని చెప్పారు. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఎకరాకు రూ.15 వేలు చెల్లిస్తే మరీ ఎక్కువ
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ.15 వేలు చెల్లిస్తే ఇంకా ఎక్కువ అవుతుందని తెలిపారు. రైతుబంధు కంటే, బోనస్ అందించడం రైతులకు ఎట్ల మేలు అవుతుందో మంత్రి తుమ్మల, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి రుణమాఫీ చేసి మొండి చేయి చూపారని విమర్శించారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని, చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు పథకం బందు చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారని గుర్తుచేశారు. అనుకున్నట్లే రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు.
రైతు భరోసా ఏదీ..
రైతుభరోసా వస్తోందని ఆశతో ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా అని ప్రశ్నించారు. రైతులను మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ అని నిలదీశారు. మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా అని దుయ్యబట్టారు. పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.