CM Revanth Reddy : బనకచర్లపై కూర్చొని మాట్లాడుకుంటే వివాదం ఉండదు : సీఎం రేవంత్‌రెడ్డి

Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్టు గురించి కూర్చొని మాట్లాడుకుంటే వివాదం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బనకచర్ల-గోదావరి ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని రేవంత్ ప్రకటించారు. ఏపీ కేంద్రానికి పీఎఫ్‌ఆర్ ఇవ్వడం వల్ల వివాదం మొదలైందన్నారు. పీఎఫ్‌ఆర్ ఇచ్చేముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్ (పీఎఫ్‌ఆర్) ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోందన్నారు. బనకచర్లపై కేంద్రం అన్నిరకాల చర్యలకు సిద్ధమైందని స్పష్టం చేశారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దామని కోరారు. ఒక రోజు కాదు.. నాలుగు రోజులైనా చర్చిద్దామన్నారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయన్నారు. న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దామన్నారు. వివాదాల పరిష్కారంలో తనకెలాంటి బేషజాలు లేవన్నారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే చెప్పుకోవాలన్నారు. విభజన చట్టం ప్రకారం గతంలో ముఖ్యమంత్రులు స్థాయిలో చర్చలు జరిపామని, అనేక అంశాలను ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించామని సీఎం రేవంత్ అన్నారు.
మోదీకి చంద్రబాబు సపోర్టు కావాలి..
తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దన్నారు. పక్క రాష్ట్రాలతో వివాదం కోరుకోవడం లేదన్నారు. కింది రాష్ట్రంగా ఏపీకి హక్కులు ఉన్నాయంటున్నారని, అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయన్నారు. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం ఉందని, కేబినెట్‌లో బనకచర్లపై చర్చిస్తామన్నారు. ఒక అడుగు ముందుకేసి తామే ఏపీని చర్చలకు పిలుస్తామన్నారు. మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సపోర్టు కావాలన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే గోదావరి నీటిని తరలించాలన్నారు. విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉందని, బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు అన్నారు.
బనకచర్లపై తెలంగాణ అభిప్రాయం తప్పక తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 2016, 2018లో ఏపీ సర్కారు రెండు జీవోలు ఇచ్చిందన్నారు. ఏపీ జీవోల ఆధారంగా వ్యాప్కోస్ 150 పేజీల నివేదిక ఇచ్చిందన్నారు. గోదావరి-పెన్నా అనుసంధానంలో బనకచర్ల ఒక భాగం అన్నారు. 86 రోజుల్లో 400 టీఎంసీలు తరలించేలా బనకచర్ల డిజైన్ చేశారని, గోదావరిలో 968 టీఎంసీలు వాడే వెసులుబాటు తెలంగాణకు ఉందని చెప్పారు. కేటాయించింది వాడుకునేందుకు అవకాశం ఇవ్వట్లేదన్నారు. కేటాయింపులు వాడుకునే అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదం నెలకొందన్నారు. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదన్నారు. వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్‌లైన్ లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.