MLA Kunamneni : కాళేశ్వరంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు తీసేసి, వాటిలోని పైపులను వాడుకోవాలని సూచించారు. మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.20వేల కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. అంత ఖర్చు పెట్టినా వరద ఉద్ధృతి వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుకు బదులు ప్రాణహిత పూర్తిచేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
మూడు ప్రాజెక్టులు తీసేయడం వల్ల కేవలం రూ.10వేల కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. మరమ్మతులు చేసే బదులు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో గోదావరిపై 14 చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృథా అని తాను చెప్పలేదని, కేవలం మూడు బ్యారేజీలపై మాత్రమే తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. తెలంగాణను సంప్రదించకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టులు చేపడుతున్నారని, బనకచర్ల ప్రాజెక్టును ఆపేయాలని కోరారు.
పరివాహక ప్రాంతాల వారీగా నిబంధనల మేరకు నీటి వాటాలు జరగాలన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుకోవాలని కోరారు. నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం కడుతున్న ఏపీకి కొత్త ప్రాజెక్టులు ఎందుకు? తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూనంనేని కోరారు.