Last Updated:

Subhash Chandra Bose: మరణంలేని మహా వీరుడు.. నేతాజీ .!

Subhash Chandra Bose: మరణంలేని మహా వీరుడు.. నేతాజీ .!

The Visionary Patriot, Revolutionary Leader Netaji Subhash Chandra Bose: పరాయి పాలనలో మగ్గుతున్న భారతావనికి తిరిగి స్వపరిపాలన కావాలంటూ అనేక మంది నేతలు తమదైన రీతిలో పోరాటాలు చేశారు. వీరిలో కొందరు అహింసా మార్గాన్ని ఎన్నుకోగా, మరికొందరు సాయుధపోరాటం దిశగా అడుగులు వేశారు. తమ ప్రాణాలర్పించారు. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తన్న సర్వీసుగా భావించే ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర పోరాటంలో భాగం పంచుకుని, మరణించే నాటికి యావత్ భారతానికి తిరుగులేని నాయకుడని అనిపించుకున్న అరుదైన నేత.. సుభాష్ చంద్రబోస్. అహింస, సత్యాగ్రహాలతో ఇక స్వాతంత్ర్యం రాదని యావత్ భారతదేశం నిరాశలో కూరుకుపోయిన వేళ.. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’అని యువతను సాయుధపోరాటం దిశగా అడుగులు వేయించి, బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన యోధుడు మన నేతాజీ. భారతదేశం శాంతిదేశమనీ, అయితే.. అవసరమైతే ఆయుధం పట్టటమూ చేతనైన దేశమని ప్రపంచానికి చాటిన వీరుడు. నేడు ఆ కర్మయోగి 128వ జయంతి. ఈ రోజును ఏటా భారత ప్రభుత్వం ‘పరాక్రమ్ దివస్’గా జరుపుతోంది.

ఒడిశాలోని కటక్‌లో 1879 జనవరి 23వ తేదీన జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు నేతాజీ జన్మించారు. ఆ దంపతుల సంతానంలో నేతాజీ తొమ్మిదవ వాడు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్.. తత్వశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. నాడు బ్రిటిషర్లు నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్ష (ఐసీఎస్‌)లో అఖిల భారత స్థాయిలో నాలుగో ర్యాంకు పొంది బ్రిటన్ వెళ్లి శిక్షణ కూడా పొందారు. కానీ..ఆ సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం జరగటంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదు. తర్వాతి రోజుల్లో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడి ప్రభావంతో సన్యాసం తీసుకోడానికి నిర్ణయించుకున్న బోస్..కొన్నాళ్లకు ఆ ఆలోచనను పక్కనబెట్టి శ్రీ ఆర్యా పత్రికలో సంపాదకుడిగా ఉంటూ.. యువతను స్వాతంత్ర పోరాటంవైపు మళ్లించే వ్యాసాలు రాశారు.తన 23వ ఏట కాంగ్రెస్ పార్టీలో చేరి బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్‌ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ లక్షలాది మందిని స్వాతంత్ర్య పోరాటంలోకి తీసుకొచ్చారు. బ్రిటిష్ అధికారి వెల్స్ క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్‌తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు. ఉప్పు సత్యా గ్రహ పోరాటం తదితర పోరాటాల్లో పాల్గొని మొత్తం 11 సార్లు జైలు పాలయ్యారు. జైలు నుంచి 1937లో విడుదల కాగానే తన 41వ ఏట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై దేశంలోనే అత్యంత జనాదరణ గల నేతగా నిలిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే రెండవసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. బోస్ మరోసారి పోటీకి సిద్ధం కావటాన్ని గాంధీజీ వ్యతిరేకించారు. తన అభ్యర్థిగా భోగరాజు పట్టాభిసీతారామయ్యను పోటీకి దింపాడు. సీతారామయ్యపై సుభాష్ 203 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో ‘పట్టాభి ఓటమి నా ఓటమి’ అన్న గాంధీజీ స్టేట్‌మెంట్‌ ఇవ్వటం, కార్యనిర్వాహకవర్గం ఏర్పాటులో బాపూజీ సహకరించకపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా రాజీనామా చేయక తప్పలేదు.

వెంటనే, కాంగ్రెస్‌లోని కొందరు నేతలతో కలిసి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించారు. అప్పుడే మొదలైన రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉన్న దేశాల కూటమిలో చేరి స్వాతంత్ర్యం పొందగలమని భావించారు. 11సార్లు జైలుపాలయ్యాడు. 7సంవత్సరాలు భారతీయ జైళ్ళలోనూ, 4సంవత్సరాలు దేశాంతరవాసంలోనూ గడిపాడు. ఆరోగ్యం బాగా క్షీణించింది. క్షయ వ్యాధి, గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నట్లు బ్రిటీష్ డాక్టర్లే నిర్ధారించారు. తక్షణ చికిత్స చేయించకపోతే ప్రాణానికే ప్రమాదమని నివేదిక ఇచ్చారు. ‘విడుదల చేస్తాం. కానీ అతడు భారత భూభాగంలో ఉండకూడద’ని బ్రిటిష్ ప్రభుత్వం షరతు పెట్టింది. చివరిసారిగా 1940 డిసెంబరులో జైలు నుంచి విడుదలయ్యాక, ఇక దేశంలో ఉండి తాను చెయ్యగలిగింది ఏమీలేదని నిర్ణయానికి వచ్చి 1941, జనవరి 16న కలకత్తాలోని తన ఇంటినుంచి మారువేషంలో దేశం దాటారు. బ్రిటీష్ పోలీసుల, గూఢచారుల కండ్లుగప్పి కాబూల్ మీదగా 4 నెలలు ప్రయాణించి బెర్లిన్ చేరుకున్నాడు. ఈ ప్రయాణ కాలంలోనే 1941 ఫిబ్రవరి 27న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ రేడియోలో అద్భుత ప్రసంగం చేసి యావత్‌ భారతాన్నీ ఆవేశంలో ముంచెత్తారు. జర్మనీ,జపాన్ సాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో బెర్లిన్‌లో 1942 జనవరి 26న బెర్లిన్‌లోనే ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ఏర్పాటు చేసి, 1943లో సింగపూర్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరచి బ్రిటిషర్లకు చెమటలు పట్టించారు. అదే ఏడాది అక్టోబరు 21న అండమాన్ నికోబార్ దీవుల్లో జాతీయ జెండాను ఎగిరేలా చేశారు. మహిళలకు రంగూన్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి రెజి మెంట్‌ ఏర్పాటు చేసి యుద్ధ శిక్షణ మొదలు పెట్టారు.

జర్మనీ చేరిన ఏడాదికి హిట్లర్‌ను కలిసి భారత స్వాతంత్ర్య పోరాటానికి మద్దతును కోరారు. నేతాజీని కలవక ముందు హిట్లర్‌కి భారత్ పట్ల పెద్ద సానుభూతి ఉండేది కాదు. ఈ సమావేశంలో నేతాజీ ఆ అభిప్రాయాన్ని పోగొట్టినా, హిట్లర్ నుంచి పెద్దసాయం పొందలేకపోయారు. అయితే, నేతాజీని సురక్షితంగా జర్మనీ నుంచి తూర్పు ఆసియాకి చేర్చటానికి ఆయన అంగీకరించారు. అనంతరం 1944 ఫిబ్రవరి 4న చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చారు. అదే రోజు బర్మా రాజధాని రంగూన్ నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ సేనలు ‌భారత్ సరిహద్దులకు చేరి, తర్వాత రెండేళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్- కొహిమాను ఆక్రమించుకున్నాయి. వీరి ధాటికి అక్కడి బ్రిటిష్ సైన్యం కుదేలయింది. ఈశాన్య భారతం నుంచి నేతాజీ సేనలు వస్తున్నాయనే కబురుతో తూర్పు భారతం స్వాగతానికి సిద్ధమవుతోన్న వేళ.. రెండవ ప్రపంచయుద్ధం కొత్త మలుపు తిరిగింది. అప్పటివరకూ గర్జించిన జర్మనీ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్ మరణం, జపాన్ మీద అమెరికా అణుదాడితో బోస్ పథకం తలకిందులైంది. దీంతో చివరి యత్నంగా సోవియట్ రష్యా మద్దతును కోరటం కోసం బోస్ జపాన్‌కు చెందిన యుద్ధవిమానంలో బయలుదేరారు. 1945 ఆగస్టు 18న మధ్యాహ్నం తైపీ నుంచి బయలుదేరిన ఆ విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది. ఇదే నేతాజీకి సంబంధించి మనకు తెలిసిన ఆఖరి అధికారిక సమాచారం. ఆనాడు కూలిన విమానంతో బాటే కోట్లాది భారతీయుల ఆశలూ నేల కూలాయి. నేతాజీ మరణించారా? రష్యాలో బందీ అయ్యారా? అనేవి నేటికీ తేలని ప్రశ్నలుగానే మిగిలి పోయాయి. స్వాతంత్ర్యం వచ్చిన పిదప ఏర్పడిన ప్రభుత్వాలు ఈ అంశంపై వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించాయి.

రెండువందల ఏళ్ల బానిస పాలన, వందేళ్ల స్వరాజ్య పోరాటం తర్వాత తమను నడిపించే నాయకుడిగా బోస్‌ను ఊహించుకుంటున్న వేళ.. ఆ మహానాయకుడు చివరి నిమిషంలో ప్రపంచ యవనిక నుంచి మాయమైపోవటం ఖచ్చితంగా భారతీయుల దురదృష్టమేనని చెప్పాలి. స్వాతంత్ర్యం తర్వాత నేతాజీ నాయకత్వంలో తొలి ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఉంటే.. జర్మన్ జీవితచరిత్రకారుడు అలెగ్జాండర్ రెత్ భావించినట్లు భారతదేశ స్థితి ఇప్పుడున్న దానికంటే వందరెట్లు మెరుగ్గా, ప్రపంచంలోనే అగ్రదేశంగా మారిఉండేదేమో. క్రమశిక్షణ, దేశభక్తి గల నేతగా సుభాష్‌ చంద్రబోస్‌ జనం మనసులో నేటికీ సజీవంగా నిలిచే ఉన్నారు. వారి జయంతి సందర్భంగా ఆ అమర వీరుడికి నివాళి.

ఇవి కూడా చదవండి: