Harish Rao: పోలీసు పహరాలో గ్రామసభలా? పాలకులు విహారం చేస్తే పాలన సంగతేంది? బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్
EX Minister Harish Rao Sensational Comments on Grama Sabalu: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనటంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా విఫలమైందో దీనిని బట్టి అర్థమవుతోందని విమర్శించారు. సీఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లోని పార్టీ సభల్లో పాల్గొంటే జనం బాధలు ఎవరు పట్టించుకోవాలని నిలదీశారు.
తిరగబడుతున్న జనం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాల ఎంపిక కోసం రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. అయితే, పలు చోట్ల జనం అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ నిలదీయటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జనానికి సర్ది చెప్పలేక అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఇంకొన్ని చోట్ల పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ఈ గ్రామసభలెందుకని కూడా జనం ప్రశ్నించటంతో పలు గ్రామసభలు రసాభాసగా మారాయి.
ఇది ప్రజా వ్యతిరేక పాలన
బూటకపు హామీలతో ఏడాది నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు.‘మీ సోకాల్డ్ ప్రజాపాలనపై జనం ఎంత కోపంగా ఉన్నారో ఇకనైనా తెలిసిందా? మీరు గొప్పగా ప్రారంభించిన గ్రామ సభలలో జనం తీరు చూశాకైనా, వారిలో మీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోండి. గ్రామసభల్లో నేటి గందరగోళ వాతావరణం చూస్తుంటే మీ ఏడాది పాలన ఫెయిల్యూర్ అని తెలుస్తోంది. సీఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె’అని నిలదీశారు.
పోలీసు నీడలో గ్రామసభలా?
స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాల్సిన గ్రామసభలను పోలీసు పహరా మధ్య నిర్వహించటానికి కారణమేంటని హరీశ్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం పేరు చెబుతూనే, కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తామని మీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇక గ్రామసభ దేనికని నిలదీశారు. దీనిని బట్టి అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ హామీలు, గెలిచాక ఎగవేతలు అన్నట్లు చేస్తే జనం తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల విషయంలో హస్తం నేతలు జనానికి జవాబుచెప్పుకోలేని దుస్థితిలో పడిపోయారని ఎద్దేవా చేశారు.
ఇకనైనా పద్ధతి మారాలి
ఏడాది కాలంలో కాంగ్రెస్ చేసిన మోసాలు, దగాల మీద నిలదీసే వారిని అరెస్ట్ చేయించటం మీద ఉన్న శ్రద్ధను ప్రజల సమస్యలను పరిష్కరించటం మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెట్టాలని హరీశ్ హితవు పలికారు. లేకపోతే, యావత్ తెలంగాణ ఏకమై ప్రభుత్వ దుర్మార్గ పాలన మీద పోరాడుతుందని హెచ్చరించారు. కేసులు పెడతారని భయపడే పరిస్థితిలో జనం లేరని, ప్రజలు ఉద్యమించక ముందే కళ్లు తెరవాలిన వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.