Last Updated:

National Consumer Rights Act: వినియోగదారుడి చేతిలో బ్రహ్మాస్త్రం

National Consumer Rights Act: వినియోగదారుడి చేతిలో బ్రహ్మాస్త్రం

National Consumer Rights Act: దేశంలోని వినియోగదారులు కొనే ప్రతీ వస్తువులో నాణ్యత, తూకం, విలువ పరమైన లోపాలు లేకుండా చూడటంతో బాటు వారు పొందే సేవలు తగిన ప్రమాణాలతో ఉండేలా చూసేందుకు గానూ 1986 డిసెంబరు 24న భారత ప్రభుత్వం ‘జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం’పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కాలానుగుణంగా అనేక సవరణలు చేస్తూ దీనిని బలోపేతం చేస్తూ వస్తోంది. ఈ చట్టం అన్ని రకాల మోసాలు, అవకతవకల నుండి వినియోగదారులకు రక్షణను కల్పిస్తుంది. వినియోగదారుడు తాను కొన్న ఉత్పత్తి, పొందిన సేవ విషయంలో మోసానికి గురైనట్లు రుజువు చేయగలిగితే, సులభంగా వారికి తగిన నష్టపరిహారం అందేలా చేయటంలో ఈ చట్టం తగిన తోడ్పాటును అందిస్తుంది. ఈ చట్టం మీద సమాజంలోని వినియోగదారులందరికీ మెరుగైన అవగాహన కల్పించేందుకు ఈ చట్టం ఉనికిలోకి వచ్చిన డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం పేరుతో నిర్వహిస్తున్నారు. దేశంలో వినియోగదారుల హక్కులకు భద్రత లేని రోజున.. కస్టమర్ల ఆరోగ్యం దెబ్బతిని దేశం ఆర్థికంగా కుంగిపోతుందని వినియోగదారుల హక్కుల బిల్లును అమెరికా దిగువ సభలో ప్రవేశపెడుతూ నాటి అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడీ అభిప్రాయపడ్డారు. ‘మన వద్దకు వచ్చే కస్టమర్‌ని అత్యంత విలువైన వ్యక్తి. మన వద్దకు వచ్చాడని, అతడు మన మీద ఆధారపడి ఉన్నాడని అనుకోవద్దు. అతడు రావటం వల్ల మన పనికి అంతరాయం కలుగుతుందని అనుకోవద్దు. ఎందుకంటే.. మన పనికి మూలమే.. అతడు.’అని పూజ్య గాంధీజీ వ్యాఖ్యానించారు.

వినియోగదారుల అభిరుచులు, ఆలోచనలను ప్రభావితం చేస్తూ పలు వ్యాపార సంస్థలు మోసాలకు పాల్పడే ధోరణి నేడు దేశంలో బాగా పెరుగుతోంది. తగ్గింపు ధరలు, పండగ విక్రయాలు, ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి మాయలో పడి అటు.. వినియోగదారులు తరచూ నష్టపోతున్నారు. కొన్ని వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం, నైతికత లోపించటం వల్ల వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితులను ముందుగా ఊహించిన మన ప్రభుత్వాలు.. 1986 నుంచే వినియోగదారుల హక్కుల చట్టం అమలు కోసం కేంద్రం ప్రతి జిల్లా కేంద్రంలోనూ ‘రీడ్రసల్‌ ఫోరమ్స్‌’ను ఏర్పాటు చేశాయి. వీటిని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఫోరమ్స్‌గా విభజించారు. జిల్లా ఫోరానికి రిటైర్డ్‌ జిల్లా జడ్జి అధ్యక్షుడిగా, మరో ఇద్దరు మెంటర్లుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఫోరంలోని కేసులపై తీర్పు ఇస్తారు. లక్షలోపు నష్టపరిహారం కోరే కేసులకు రూ. 100, రూ. 1 నుంచి 5 లక్షల మధ్య నష్టపరిహారం కోరే కేసైతే రూ. 200, రూ. 10 లక్షల వరకు నష్టపరిహారం కేసులకు రూ. 400, పది లక్షల కంటే ఎక్కువ నష్టపరిహారం కోరే కేసులకు రూ. 500 కోర్టు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యాపారి లేదా డీలర్ ద్వారా కస్టమర్‌కు నష్టం చేకూరితే వారిపై నేరుగా జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. మనం కొనే ప్రొడక్ట్‌‌లో ఒకటి కంటే ఎక్కువ లోపాలుండి, వాటిని గురించి ఫిర్యాదు చేసినా సర్వీసు విషయంలో డీలర్‌ పట్టించుకోకున్నా, కొనే వస్తువు అసలు ధరకంటే వ్యాపారి లేదా డీలర్ ఎక్కువ రేటు వసూలు చేసినా, మరే విధంగా నష్టపోయినా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు తెల్ల కాగితంపై ఫిర్యాదు రాసి నేరుగా లేదా పోస్టులో లేదా E-Daakhilపోర్టల్‌లో అన్ని వివరాలు, ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, తాను ఏం నష్ట పరిహారం కోరుతున్నాడనేదీ వివరంగా అందులో రాయాలి. ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులో సాధారణంగా 90 రోజులలో తీర్పు ఇవ్వాలని చట్టం చెబుతోంది. అవసరాన్ని బట్టి కక్షిదారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానూ విచారణ కోరవచ్చు.

రూ. 20 లక్షల లోపు నష్టపరిహారం కోరే కేసులను జిల్లా ఫోరంలో, రూ.20 లక్షల నుంచి రూ.కోటిపైన పరిహారం కోరే కేసులు.. రాష్ట్ర కమిషన్‌లో, రూ.కోటికి మించిన పరిహారమైతే జాతీయ కమిషన్‌‌లో ఫిర్యాదు చేయాలి. ఒక వస్తువును కొన్ని లేదా పాడైన రోజు రోజు నుంిచ రెండేళ్లలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జిల్లా ఫోరంలో న్యాయం జరగకపోతే, 45 రోజుల లోపల రాష్ట్ర కమిషన్‌కు అప్పీలు చేసుకోవచ్చు. జిల్లా కమిషన్‌ తీర్పును అనుసరించి వ్యాపారి, విక్రయదారుల ఆస్తులు జప్తు చేసే అధికారం ఉంటుంది. 1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేసే అవకాశమూ ఉంది. అలాగే, ఇటీవల ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరగటంతో నకిలీ, నాసి వస్తువుల జాడ్యం కూడా పెరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం.. ఈ ఉత్పత్తులనూ వినియోగదారుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. తప్పుడు వ్యాపార విధానాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలకూ రెండేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టంలో ఉన్నప్పటికీ, ‘చిన్న చిన్న వాటికి సమయం వెచ్చించి ఫోరం చుట్టూ తిరగటం మన వల్ల కాదులే’ అనే భావనతో ఉండటంతో మార్కెట్‌శక్తులు వినియోగదారులను తేలిగ్గా మోసం చేస్తున్నాయని, వినియోగదారుల హక్కుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు. ఉదాహరణకు, గతంలో హైదరాబాద్‌లోని హైదర్ నగర్ శాఖ డీమార్ట్‌లో క్యారీ బ్యాగ్ కోసం రూ. 3.50 వసూలు చేశారు. దానిపై ఆ సంస్థ లోగో ఉండటంతో అది ప్రచారం కోసమేనని, ఒకవైపు వారు తమ ప్రచారం చేసుకుంటూ వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేయటమేంటని ఒకరు కేసు నమోదు చేయగా, దీనికి స్పందించిన ఫోరం అతడి నుంచి వసూలు చేసిన రూ.3.50తో బాటు పరిహారంగా రూ.1,000, న్యాయ సేవా కేంద్రానికి రూ.1,000 చెల్లించాలని ఆ డీమార్ట్ ‌శాఖను ఆదేశించింది. ఈ కేసులో మొత్తం చిన్నదే అయినా.. ఈ కేసుపై మీడియా చేసిన ప్రచారం మూలంగా జనంలో వచ్చిన చైతన్యం వల్ల తర్వాత సినిమా హాళ్లలో పార్కింగ్ చార్జీలూ రద్దయ్యేలా పలు కేసులు నమోదయ్యాయి.

ఈ విషయంలో చట్టం బలంగా ఉండటంతో వినియోగదారులకు న్యాయం జరుగుతున్నప్పటికీ, ఈ కేసుల విచారణ ఆలస్యంగా ఉంటోంది. ముఖ్యంగా బీమా, బ్యాంకింగ్ సంస్థల ముఖ్య కార్యాలయాలు ముంబయి, దిల్లీ నగరాలలో ఉండటం, ఆయా కేసులకు సకాలంలో కౌంటర్లు దాఖలు చేయకపోవటంతో విచారణ లేటవుతోంది. జిల్లా ఫోరంలో సిబ్బంది కొరత బాగా ఉంది. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి కమిషన్‌లో మధ్యవర్తుల ప్యానల్‌ను ఏర్పాటు చేసినా పెద్ద ప్రయోజనం ఉండటం లేదు. అటు విద్యార్థులు, యువతలోనూ దీనిపై పెద్ద అవగాహన లేదు. వినియోగదారుల హక్కులపై పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలోని 50 పాఠశాలల్లో విద్యార్థులతో వినియోగదారుల క్లబ్బులు ఏర్పాటు చేసింది. వాటికి సంబంధించిన సామగ్రి కోసం రూ.10వేల ఆర్థిక సాయాన్నీ అందించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు. అయిదేళ్లకే ఆ క్లబ్బులు అటకెక్కాయి. కాగా, 2002లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి మండలంలోని మూడు పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్బులు ఏర్పాటు చేసింది గానీ అవి చురుగ్గా పనిచేసే పరిస్థితులు కల్పించటంలో విఫలమైంది. ఈ వినియోగదారుల హక్కుల దినోత్సవం రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రయత్నం మరింత ముమ్మరంగా సాగాల్సిన అవసరముంది.