Published On:

French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్.. ఉత్కంఠగా తుది పోరు

French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్.. ఉత్కంఠగా తుది పోరు

Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా స్పెయిన్ కు చెందిన టెన్నిస్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. నిన్న హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నెం. 1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ ను 5 సెట్ల భారీ ఫోరులో మట్టికరింపించాడు. ఫైనల్ మ్యాచ్ మొత్తం 5.29 గంటలపాటు సాగింది. కాగా అల్కరాజ్ మొదటి రెండ్లు సెట్లలో వెనకబడినప్పటికీ మిగిలిన మూడు సెట్లలో ప్రత్యర్థి సిన్నర్ కు చుక్కలు చూపించాడు. 4-6, 6-7 (4-7), సెట్లతో వెనకబడ్డాడు. అనంతరం.. 6-4, 7-6 (7-3), 7-6 (10-2) తేడాతో మిగిలిన మూడు సెట్లలో సత్తా చాటాడు. చివరకు 3-2 తేడాతో టైటిల్ సొంతం చేసుకున్నాడు.

మ్యాచ్ ఆరంభంలో జెన్నిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని చూపించాడు. మొదటి సెట్ లో అల్కరాజ్ సర్వీస్ ను బ్రేక్ చేసి విజయం సాధించాడు. అనంతరం రెండో సెట్ లోనూ అదేజోరు కొనసాగించినా.. అల్కరాజ్ తన సత్తా ఎంటో చూపించాడు. మ్యాచ్ ను టై బ్రేక్ వరకు తీసుకెళ్లాడు. కానీ నిన్నర్ ఆ సెట్ ను 7-4 తేడాతో సొంతం చేసుకున్నాడు. రెండు కోల్పోయిన తర్వాత అల్కరాజ్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. మూడో సెట్ ను మంచి షాట్లు ఆడుతూ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. అతనికి అవకాశం లేకుండా చేశాడు. దీంతో మూడో సెట్ ను 6-4 తేడాతో అల్కరాజ్ గెలుచుకున్నాడు. నాలుగో సెట్ ను టై బ్రేకర్ లో 7-6 తేడాతో చేజిక్కించుకున్నాడు. దీంతో చెరి రెండు సెట్లు గెలిచి ఇద్దరు ప్లేయర్లు సమ ఉజ్జీలుగా నిలవడంతో ఐదో మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

ఐదో సెట్ లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరకు మ్యాచ్ మళ్లీ టై బ్రేకర్ కు వెళ్లింది. దీంతో అల్కరాజ్ 7-6 (10-2) తేడాతో విజయం సాధించాడు. దీంతో వరుసగా రెండోసారి అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. కాగా అల్కరాజ్ ఇప్పటికే యూఎస్ ఓపెన్ ఒకసారి, వింబుల్డన్ రెండుసార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ఓకసారి గెలుచుకోగా తాజా విజయంతో ఐదో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.