EPFO Raises Auto-Settlement: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకునే అవకాశం!

EPFO Raises Auto-Settlement Limit For Advance Claims From Rs 1 Lakh To Rs 5 Lakh: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇక నుంచి రూ. 5 లక్షల వరకు వెంటనే డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తాల ముందస్తు ఉపసంహరణ కోసం సభ్యులు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. లక్షలాది మందికి భారీ ఉపశమనం కల్పిస్తూ అడ్వాన్స్ క్లెయిమ్స్ కోసం ఆటో-సెటిల్మెంట్ పరిమితిని ఈపీఎఫ్‌వో రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది.
ముఖ్యంగా అత్యవసర సమయాల్లో త్వరగా నిధుల యాక్సెస్‌ను సులభతరం చేస్తుంది. ఈపీఎఫ్‌వో తాజా విధాన నిర్ణయం మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండా మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఉద్యోగులకు వెంటనే ఆర్థిక సహాయం అందించేందుకు గతంలో కరోనా మహమ్మారి సమయంలో ఈపీఎఫ్ఓ మొదట అడ్వాన్స్ క్లెయిమ్‌ల ఆటో-సెటిల్మెంట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఆటో-సెటిల్మెంట్ పరిమితి పెరుగుదలతో సభ్యులు రూ. 5 లక్షల వరకు తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. ఇదిలా ఉండగా, మొన్నటివరకు రూ. లక్ష కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేసుకునేందుకు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం నిరీక్షించాల్సి ఉండేది. ఆ తర్వాత నాన్-ఆటో సెటిల్మెంట్కు ఈపీఎఫ్ఓ చందాదారులు ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించి మాన్యువల్ ఆమోదం పొందాల్సి ఉండేది. ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టేంది. ఈ నేపథ్యంలో కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ఓ దీనిని సవరించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ గత మార్చి నెలలో ASAC పరిమితిని రూ. 5 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఆమోదించింది. అంతకు ముందు ASAC పరిమితి రూ.50 వేలు ఉండగా, 2024 మేలో దాన్ని రూ. లక్షకు పెంచారు. FY24లో దాదాపు 9 మిలియన్ల మేర ఆటో-సెటిల్మెంట్ క్లెయిమ్‌లు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 మిలియన్లకు చేరాయి.