Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 26వేల మందికి ఊరట

Deputy CM Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ బిల్లుల బకాయిలను మంజూరు చేసింది. అయితే గతంలో రూ.180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి అన్ని నిధులు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో దాదాపు 26,519 మందికి లబ్ధి కానుంది.
కాగా, గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను సైతం డిప్యూటీ సీఎం క్లియర్ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. పెండింగ్ బిల్లులను ఒకేసారి విడుదల చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్ మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం వాటిని క్లియర్ చేశారు. కాగా, గత ప్రభుత్వం మార్చి 2023 నుంచి జూన్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.