IPL 2025: డికాక్ మెరుపు ఇన్నింగ్స్.. కోల్‌కతా ఘన విజయం

KKR Beat RR in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి తన సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (29), శాంసన్(13), పరాగ్(25), నితీశ్ రాణి (8), హసరంగ(4), జురెల్(33), శుభమ్ దూబె(9). హెట్ మయర్(7) ఆర్చర్(16) పరుగులు చేశారు. ఇందులో ధ్రువ్ జురెల్(33) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సన్ ఒక వికెట్ తీశాడు.
152 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా బ్యాటర్లు సులువుగా ఛేదించారు. ఓపెనర్ సునీల్ నరైన్ స్థానంలో వచ్చిన డికాక్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మరో ఓపెనర్ మొయిన్ అలీ(5) రనౌట్ రూపంలో విఫలమైయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానె(18) కాసేపటికే పెవిలియన్ చేరగా.. ఇంపాక్ట్ ప్లేయర్ రఘువంశీ(22) డికాక్‌కు మంచి సహకారం ఇవ్వడంతో డికాక్(97) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్‌కతా 17.3 ఓవర్లలోనే 152 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ వికెట్ తీశాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు తొలి విజయం కాగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వరుసగా రెండో ఓటమి.