MI Won by 12 Runs: ఢిల్లీకి తొలి ఓటమి.. ముంబైకి రెండో విజయం

Mumbai Indians Won by 12 runs against Delhi Capitals in IPL 2025 29th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో 29వ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా.. ఢిల్లీ ఓటమి చెందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి తొలి ఓటమి కాగా, ముంబై రెండో విజయం నమోదుచేసింది. ఆదివారం జరిగిన రసవత్తరమైన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ గెలుపొందింది.
తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్ చేపట్టింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(18), రికిల్‌టన్(41), సూర్యకుమార్ (40), తిలక్ వర్మ(59), నమన్ ధీర్(38), హార్దిక్ పాండ్యా(2) పరుగులు చేశారు. తిలక్, నమన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 33 బంతుల్లో 62 పరుగులు చేశారు. దీంతో ముంబై 200 పరుగుల మార్క్‌ను దాటింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్, కుల్‌దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ వికెట్ తీశాడు.
206 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ రనౌట్ అయింది. మ్యాచ్ తొలి బంతికే జాక్ ఫ్రేజర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిషేక్ పోరెల్(33)తో కలిసి కరుణ్ నాయర్(89) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 119 పరుగులు చేశారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. అయితే వరుసగా కరుణ్, అక్షర్(9), స్టబ్స్(1) ఔట్ కావడంతో ముంబై పోటీలోకి వచ్చింది.
16వ ఓవర్‌లో రాహుల్(15) పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అశుతోష్, విప్రాజ్ ఆడేందుకు ప్రయత్నించినా వికెట్ల ముందు దొరికిపోయారు. చివరి ఓవర్‌లో అశుతోష్, కుల్‌దీప్, మోహిత్ రనౌట్ అయ్యారు. దీంతో 193 పరుగులకు ఢిల్లీ ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ 2, దీప్, బుమ్రా తలో వికెట్ తీశారు.