IND vs WI 1st Test: తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ విక్టరీ
IND vs WI 1st Test: డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి టెస్ట్‌లోని ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్లపై గెలుపొందింది.
IND vs WI 1st Test: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రెండు సిరీస్ లలోనూ ఓటమిని చవిచూసిన భారత్.. మూడో సీజన్‌ని గ్రాండ్ విక్టరీతో ప్రారంభించింది. డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి టెస్ట్‌లోని ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్లపై గెలుపొందింది. దీనితో 2 టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడిన విండీస్ జట్టుపై టీమిండియా స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో అశ్విన్ విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి కరేబియన్స్ పతనాన్ని శాసించాడు. అలాగే మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు యువ బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్(171). అంతేకాకుండా కెప్టెన్‌గా తన టీమ్ ని సెంచరీతో ముందుండి నడిపించారు రోహిత్ శర్మ(103). విరాట్ కోహ్లీ(76) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఇక బౌలింగ్‌లో అశ్విన్‌కి తోడు రవీంద్ర జడేజా సైతం భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
విఫలమైన విండీస్ టీం (IND vs WI 1st Test)
ఇక వెస్టిండీస్ ప్లేయర్లలో ఏ ఒక్కరు కూడా ఆశించిన మేరకు రాణించలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలిక్ అథనాజే 47, 28 పరుగులతో విండీస్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచారంటేనే కరేబియన్స్ ఏమేర తమ ప్రతిభకనపరిచారో అర్థం చేసుకోవచ్చు.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి.. 271 పరుగుల ఆధిక్యంతో తమ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. కాగా 272 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ప్లేయర్లు కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అశ్విన్ 7, జడేజా 2 వికెట్లతో చెలరేగడంతో కరేబియన్స్ పరుగులు చెయ్యడంలో తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో భారత్ విజయకేతనం ఎగురవేసింది.