Ayatollah Khomeini: అమెరికాపై ఇరాన్ మంట..! బంకర్ లో దాక్కున్న సుప్రీం లీడర్.!

Ayatollah Khomeini: అమెరికా ప్రెసిడెంట్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని మరోసారి రుజువైంది. ఇరాన్‌కు రెండు వారాల గడువు ఇచ్చి అణ్వాయుధాల గురించి ఏదో ఒక నిర్ణయానికి రావాలని కోరారు. తీరా యావత్ ప్రపంచానికి షాక్ ఇస్తూ.. ఇరాన్‌లోని న్యూక్లియర్ ప్లాంట్‌లపై బంకర్ బస్టర్ బాంబులు వేసి తన కసి తీర్చుకున్నాడు. ఇక ఇరాన్ మాత్రం అమెరికా అంతుచూస్తానని రంకెలు వేస్తోంది.
ట్రంప్‌తో పాటు నెతన్యాహు అసలు ఉద్దేశం ఇరాన్‌లో ప్రభుత్వం మార్చాలని ఖమేనీని అధికారం నుంచి పక్కకు జరిపి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది అసలు ప్లాన్. అయితే అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెగ్‌సెత్ మాత్రం ఇరాన్‌లో ప్రభుత్వం మార్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై బాంబుదాడులను ఇటు రష్యా, అటు చైనా ఖండించాయి. ఇక ప్రపంచనాయకులంతా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. మరో పక్క తీవ్ర ఉద్రిక్తతల మధ్య చమురు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో సామాన్యుడు సతమతమవడం ఖాయం.
ఇరాన్‌పై… అమెరికా ఆదివారం బంకర్ బస్టర్ బాంబులు వేసి పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ట్రంప్ చడీచప్పుడు కాకుండా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం పట్ట యావత్ ప్రపంచ ఆశ్చర్యానికి గురైంది. ఇక ట్రంప్ తన చర్యను సమర్ధించుకుంటే….రష్యా, చైనాలు మాత్రం రెండు వారాల గడువు ఇచ్చి ఇలా అకస్మాత్తుగా దాడుల చేయడం ఏమిటని ట్రంప్‌ను నిలదీస్తున్నాయి. ఇక గత చరిత్ర తిరగేస్తే.. ఇరు దేశాల మధ్య సంబంధాలు 1953 నుంచే సవ్యంగా లేవు. 1979లో ఇస్లామిక్ మత చాందసవాదులు అయతుల్లా రుహుల్లా ఖోమేనీ నేతృత్వంలో ఇరాన్ షాను గద్దె దించిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మాత్రం ఇప్పటికే సురక్షిత బంకర్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత సురక్షితమైన బంకర్ అని అక్కడి మీడియా తెలిపింది. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడన్నది ఇరాన్ మిలటరీకి కూడా తెలియదట. అంత గోప్యంగా అయతుల్లాని కాపాడుతున్నారు.