Published On:

CSK Won by 5 Wickets: ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్.. లక్నోపై చెన్నై సూపర్ విక్టరీ!

CSK Won by 5 Wickets: ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్.. లక్నోపై చెన్నై సూపర్ విక్టరీ!

Chennai Super Kings won by 5 Wickets against Lucknow Super Giants in IPL 2025 30th Match: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. దీంతో 5 వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎం.ఎస్ ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు తెలుగు కుర్రాడు రషీద్ కీలక పరుగులు చేయడంతో చెన్నై సులువుగా గెలుపొందింది.

 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచే చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ వేయడం మొదలుపెట్టారు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లలోనే ఓపెనర్ మార్‌క్రమ్(6) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్‌ను త్రిపాఠి అద్భుతంగా తీసుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ తర్వాత క్రీజులకో వచ్చిన విధ్వంసక బ్యాటర్ పూరన్(4) ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. కాంబోజ్ బౌలింగ్‌లో పూరన్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో లక్నో ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది.

 

లక్నో రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత మార్ష్(30, 25 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు)తో కలిసి కెప్టెన్ రిషభ్ పంత్(63) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ తరుణంలో జడేజా బౌలింగ్‌లో మార్ష బౌల్డ్ కావడంతో మళ్లీ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బదోని(22), సమద్(20)లతో కలిసి పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దీంతో లక్నో 166 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో పతిరన, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, కాంబోజ్ తలో వికెట్ తీశారు.

 

167 పరుగుల లక్ష్యఛేదనను చెన్నై సూపర్ కింగ్స్ గొప్పగా ప్రారంభించింది. ఓపెనర్లు షేక్ రషీద్(27), రచిన్ రవీంద్ర(37)లు తొలి ఓవర్ నుంచే విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టారు. చెన్నై 4 ఓవర్లలో 45 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న రషీద్‌ను అవేష్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి(9)ని రివి బిష్ణోయ్ ఔట్ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న రచిన్ రవీంద్రను మార్ క్రమ్ ఎల్బీగా ఔట్ చేశాడు. వరుసగా జడేజా(7), విజయ్ శంకర్(9)లను వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో చెన్నై కష్టాల్లో పడింది. 15 ఓవర్లకు చెన్నై 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.

 

ఈ సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. చెన్నై విజయానికి 5 ఓవర్లలో 56 పరుగులు కావాల్సి ఉండగా.. 16వ ఓవర్లలోనే ధోనీ చివరి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను మళ్లీ ఊపు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 17వ ఓవర్లలో సిక్స్ బాదాడు. ఇక, 19 ఓవర్లలో శివమ్ దూబె, దోనీలు కలిసి ఏకంగా 19 పరుగులు రాబట్టారు. దీంతో చివరి ఓవర్‌లో 5 పరుగులు అవసరం ఉండగా.. 3వ బంతికి దూబె ఫోర్ కొట్టి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. 167 పరుగులను చెన్నై 19.3 ఓవర్లలో 168 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. దిగ్వేశ్, అవేష్, మార్ క్రమ్ తలో వికెట్ తీశారు.