Soros, Adani issues rock Lok Sabha: అదానీ రగడలో సోరోస్ పాత్ర ఎంత?
Soros, Adani issues rock Lok Sabha: పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్ సోరోస్’అస్త్రాన్ని చేజిక్కించుకుంది. అయితే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అమెరికన్-హంగేరియన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తున్న సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ అనుమానిస్తుంది. ఈ అంశంపైనే పార్లమెంటులో చర్చించాలనే బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఆరోపణలపై సోమవారం ఉభయ సభలలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, అక్కడి ప్రతిపక్ష నేత ఖర్గే మధ్య ఏకంగా చాలాసేపు మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ పార్టీ విదేశీ శక్తుల చేతుల్లో ‘సాధనం’గా వ్యవహరిస్తోందని, భారత్‌ను అస్థిరపరిచే శక్తులతో హస్తం పార్టీ అంటకాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఖర్గే మండిపడుతూ, నడ్డా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అటు మంగళవారమూ అదానీ అంశాన్ని ఇండియా కూటమి పార్టీలు ప్రస్తావించటం, తర్వాత ఉభయ సభలు వాయిదా పడటంతో విపక్షాలు పార్లమెంటు బయట నిరసనలకు దిగాయి. ఈ రగడ కారణంగా అదానీ అంశం పక్కకుపోయి.. జార్జి సోరోస్ ఎవరు? అయనకు సోనియాకు సంబంధమేమిటనే కొత్త చర్చ మొదలైంది.
అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ పౌండేషన్ నుంచి ఆర్థిక సాయం పొందే ఎఫ్‌డీఎల్-ఏపీ ఫౌండేషన్‌తో సోనియాగాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ రెండు రోజులుగా ఆరోపిస్తోంది. జమ్మూకశ్మీర్‌ను స్వతంత్ర దేశం చేయాలనే భావజాలంతో ఎఫ్‌డీఎల్-ఏపీ పనిచేస్తోందని ‘ఎక్స్’లో బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. సోనియాగాంధీ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ గతంలో జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసిందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆయనతో కలిసి సోరోస్-ఫండెడ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సలీల్ షెట్టి పాల్గొన్నారని ఆ ట్వీట్‌లో ఆరోపించింది. అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను జార్జి సోరోస్ నుంచి నిధులు పొందే ఆర్గనైజ్డ్ క్రైమ్అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ) సంస్థ లైవ్ టెలికాస్ట్ చేసిందని గుర్తుచేసి, జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం దీనిని బట్టి అర్ధమవుతుందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం జార్జ్ సోరోస్ తమ పాతమిత్రుడని ఇప్పటికే బహిరంగంగానే ఒప్పుకున్నారని బీజేపీ గుర్తు చేసింది.
ప్రపంచ బిలియనీర్‌గా, వితరణశీలిగా పేరొందిన జార్జ్ సోరోస్ మనదేశంలో 2020లో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వార్తల్లో నిలిచాయి. ప్రధాని మోదీ కశ్మీర్‌లో కఠిన చర్యలు తీసుకోవటంతో అక్కడి ప్రజలు తమ పౌరసత్వం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని సోరోస్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 ఫిబ్రవరిలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ‘మోదీ, అదానీకి సన్నిహిత సంబంధాలున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడింది. దీంతో మోదీ బలహీన పడే అవకాశముంది’అని సోరోస్ అప్పట్లో వ్యాఖ్యానించారు. నాటి సోరోస్ వ్యాఖ్యలపై బీజేపీ నేత స్మృతీ ఇరానీ మండిపడ్డారు. ఫోరోస్ వ్యాఖ్యలను ‘భారత ప్రధాని మీదనే గాక ఈ దేశ ప్రజాస్వామ్యం మీద జరిగిన సహించరాని దాడి’గా అభివర్ణించారామె. విదేశీ శక్తులంతా మూకుమ్మడిగా భారత ప్రజాస్వామ్య విధానంలో జోక్యం చేసుకునే యత్నం చేస్తున్నాయని.. దీనిని దేశప్రజలంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను దోచుకున్న సోరోస్‌ను ఆర్థిక నేరగాడిగా ఆ దేశం ప్రకటించిందని, అలాంటి వ్యక్తి భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రను పన్నుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి, తర్వాత ఆ దేశాలలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి తమ సంపదను పెంచుకుంటారని కూడా ఆమె ఆరోపించారు.
ఇక, సోరోస్ నేపథ్యానికి వస్తే.. హంగేరియన్- అమెరికన్ అయిన జార్జ్ సోరోస్(92) ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అనేక దేశాల్లో ఆయనకు పెట్టుబడులు, వ్యాపారాలు ఉన్నాయి. హంగేరీలో 1930లో యూదు కుటుంబంలో జన్మించిన సోరోస్, ఆ దేశాన్ని నాజీలు ఆక్రమించుకోవటంతో, ప్రాణభయంతో అక్కడి నుంచి ఫేక్ డాక్యుమెంట్లు చూపించి కుటుంబంతో సహా దేశం విడిచిపోయారు. పిదప బ్రిటన్ చేరి, 1947లో లండన్ చేరి, అక్కడి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో తత్వశాస్త్రంలో పట్టా పొందారు. తర్వాత అక్కడే కొంతకాలం పనిచేసిన ఆయన.. 1956లో అమెరికా చేరి, స్టాక్ సెక్యురిటీస్‌లో అనలిస్టుగా పనిచేశారు. తర్వాత లండన్‌లో 1969లో ఫైనాన్షియల్ ట్రేడర్‌గా పనిచేశారు. 1973లో ఒక హెడ్జ్ ఫండ్‌ను స్థాపించారు. ఫైనాన్షియల్ మార్కెట్లోని లోపాలను ఆసరాగా తీసుకొని కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1992లో ఆయన బ్రిటిష్ పౌండ్ విలువ మీద పందెం కాసి పౌండ్ విలువ తగ్గగానే 1 బిలియన్ డాలర్లు లాభం ఆర్జించారు. దాంతో ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్’ను వణికించిన వ్యక్తిగా సోరోస్‌కు పేరొచ్చింది. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే సోరోస్.. ఆది నుంచి లెఫ్ట్ లిబరల్స్‌కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. 2011 నాటికి ఆయన 8.6 బిలియన్ డాలర్ల సంపద గల ఇన్వెస్టర్‌గా ఎదిగారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా మానవ హక్కుల పరిరక్షణ పేరుతో 70కిపైగా దేశాల్లో ప్రజాస్వామ్యం, పారదర్శకత, భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలకు నిధులు అందిస్తున్నారు.
జార్జి సొరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ భారత్‌లోనూ సేవలు అందిస్తోంది. అయితే ఆ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఫండింగ్ ఇవ్వడం ద్వారా క్రైస్తవ మత మార్పిడులను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలున్నాయి. అయితే, మోదీ ప్రధాని కాగానే విదేశీ నిధులు అందుకునే ఎన్‌జీవో మీద నియంత్రణ పెంచటం సోరోస్‌కు మోదీ పట్ల వ్యతిరేకత ఏర్పడిందని కమలనాథులు చెబుతున్నారు. అలాగే, కొందరు స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఫండింగ్ ఇవ్వడం ద్వారా జార్జి సొరోస్ ఫౌండేషన్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. 60కి పైగా డిజిటల్ న్యూస్ మీడియా సంస్థలు, స్వతంత్ర పాత్రికేయులు, వ్యాఖ్యాతలకు ప్రాతినిథ్యం వహించే.. ‘డిజిపబ్’లోని భాగస్వాములకు సోరోస్ ఓపెన్ సొసైటీ నుంచి నిధులు అందుతుండటాన్ని బీజేపీ రుజువుగా చూపుతోంది. ప్రధాని మోదీని గద్దె దించాలంటే ఆయన సన్నిహితులను దెబ్బతీయాలనే వ్యూహంతోనే అదానీ ప్రతి అడుగు మీదా ఈ సంస్థ నిఘా పెట్టి, అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తోందని కమలనాథుల ఆరోపణ. ఇందులో భాగంగానే అదానీ సంస్థ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సమయంలోనే.. హిండెన్‌బర్గ్‌తో ఆరోపణలు చేయించి, అదానీ నెట్‌వర్త్ 50 శాతానికి పైగా తగ్గేలా చేశారని, రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతే ఆందోళనలు మొదలై, భారత్ పెట్టుబడులకు సురక్షితం కాదని ప్రచారం చేయొచ్చని సోరోస్ భావించారని బీజేపీ చెబుతోంది. గతంలో పదేపదే చైనా వెళ్లే రాహుల్.. ఇటీవలి కాలంలో యూరోప్, బ్రిటన్ వెళ్లటానికీ సోరోస్ ప్రభావమేనని ఆ పార్టీ అనుమానిస్తోంది. కనుక అదానీ అంశం మీద చర్చించటానికి తాము సిద్ధమేనని, అయితే, సోరోస్ కార్యకలాపాల మీద చర్చకూ కాంగ్రెస్ రెడీ కావాలని బీజేపీ సవాలు విసురుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎలా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాల్సిందే.