Google Trends: గూగుల్ ట్రెండ్స్‌లో జనసేనాని.. ప్రముఖ వ్యక్తుల జాబితాలో పవన్
Google 2024 Search Trends for Deputy cm Pawan Kalyan: మనకు ఏం తెలియకపోయినా గూగుల్‌నే అడుగుతుంటాం. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. టాప్ సినిమా ఏది..? పాట ఏది.. అక్కడి నేత ఎవరు..? మ్యాచ్ ఏమైంది.. పదాల అర్థం ఏంటి..? మనం చెప్పింది కరెక్టేనా..? ఇలా ఏ విషయం అయినా చిటికెలో చెప్పే గూగుల్ లేకుండా మన రోజు వారీ పని జరిగే పరిస్థితే లేదు. మరికొన్ని రోజుల్లో 2024 ముగిసి కొత్త ఏడాది రాబోతోన్న వేళ.. ఈ ఏడాది గూగుల్‌లో ఎవరి గురించి, దేని గురించి నెటిజన్లు వెతికారనే అంశం గురించి గూగుల్ లెక్క తేల్చింది. గూగుల్ ట్రెండ్స్ 20204 పేరుతో మన ముందుకు తెచ్చింది.
వ్యక్తుల జాబితాలో పవన్..
అత్యధిక మంది నెటిజన్లు వెతికిన.. వ్యక్తుల జాబితాలో జనసేనాని పవన్ జాతీయ స్థాయిలో అయిదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆరంభం నుంచే ఆయన గురించి నెటిజన్లు వెతుకులాట మొదలైందని, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, ఫలితాలు, తర్వాత ఆయన కార్యక్రమాల గురించి జాతీయ స్థాయిలో నెటిజన్లు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారని గూగుల్ తెలిపింది. ఈ వ్యక్తుల జాబితాలో క్రీడల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వినేశ్ ఫొగాట్ తొలిస్థానంలో నిలవగా, బిహార్ నేతలైన నితీశ్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. ఇక, మనదేశంలో క్రికెట్ మతంలాంటిది. ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ రేంజ్ మారింది. ఈ ఏడాది కూడా గూగుల్ సెర్చ్‌లో ఐపీఎల్ టాప్ ప్లేసులో నిలిచింది.