Last Updated:

Lala Lajpat Rai: నిద్రాణమైన జాతిని నిలబెట్టిన యోధుడు.. లాలా లజపతిరాయ్

Lala Lajpat Rai: నిద్రాణమైన జాతిని నిలబెట్టిన యోధుడు.. లాలా లజపతిరాయ్

Lala Lajpat Rai Birth Anniversary: స్వాతంత్య్రం అనేది బ్రిటిషర్లను బతిమాలితే వచ్చేది కాదని, భరతజాతిని చైతన్యపరచి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడితే తప్ప అది అసాధ్యమని నమ్మి, ఆ మార్గంలో నడిచి, జాతిని నడిపించిన యోధుడు లాలా లజపతిరాయ్. ‘ప్లీ.. పిటీషన్.. ప్రేయర్’ అనే బాటలో సాగుతున్న భారత జాతీయ కాంగ్రెస్ తీరు మార్చుకుని ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన నేతగానూ ఆయన గుర్తింపుపొందారు. అర్థించి తెచ్చుకునే స్వాతంత్య్రానికి ఏ విలువా ఉండదని స్పష్టం చేశారు. లాల్-బాల్-పాల్ త్రయంలో మొదటివాడైన లాలా లజపతిరాయ్ భారతదేశ వనరులను బ్రిటన్ ఏ విధంగా దోపిడీ చేస్తోందనే విషయాన్ని సాధికారికంగా అధ్యయనం చేసి ప్రకటించి, ప్రపంచం ముందు బ్రిటన్ చిన్నబోయేలా చేయటమే గాక స్వదేశీ ఉద్యమం ద్వారా భారత్ స్వావలంబన సాధించటానికి అవసరమైన కార్యాచరణను ప్రకటించారు.

లాలా లజపతి రాయ్.. 1865 జనవరి 28న జన్మించారు. పంజాబ్‌లోని ధుడికేలో జైన కుటుంబానికి చెందిన తండ్రి మున్షీ రాధా క్రిషన్ అగర్వాల్, తల్లి గులాబ్ దేవి అగర్వాల్. రాయ్ తండ్రి ప్రభుత్వ టీచరుగా ఉర్దూ, పర్షియన్ బోధించేవారు. పంజాబ్‌లోని రేవారిలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఈ కాలంలోనే స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన ఆర్యసమాజ ప్రభావానికి లోనై, ఛాందస ధోరణుల మీద పోరాడారు. అదే సమయంలో స్వదేశీ ఉద్యమం, ఆర్య సమాజాన్ని, అతివాద రాజకీయాలను సమన్వయపరిచి బ్రిటిషర్ల మీద దూకుడుగా పోరాడే చురుకైన యువనాయకత్వాన్ని తయారుచేసి, వారికి అన్ని విధాలా అండదండలు అందించారు.

అనంతర కాలంలో 1892లో లాహోర్ చేరి పంజాబ్ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఏ.ఓ హ్యూమ్ రచనలైన ‘ఓల్డ్ మేన్ హెూప్స్’, ‘స్టార్ ఇన్ ద ఈస్ట్’ అనే గ్రంథాల్లోని భావాలకు ప్రేరేపితుడై, 1888లో లాహోర్ సమావేశంలో జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. ఇటాలియన్ జాతిపిత మాజినీని తన రాజకీయ గురువుగా, చరిత్ర వీరుడైన ఛత్రపతి శివాజీని తనకు ఆదర్శ పురుషుడని ప్రకటించారు. 1904లో లార్డ్‌ కర్జన్‌ తెచ్చిన యూనివర్సిటీ చట్టాన్ని వ్యతిరేకించారు. తన యొక్క రచనలు, పత్రికల ద్వారా అన్ని వర్గాల విద్యావంతులను కూడగట్టే యత్నం చేశారు. అయితే 1907లో పంజాబ్‌ రాష్ట్రంలో రైతు ఉద్యమాలను నిర్వహించినందుకు గాను లాలా లజపతి రాయ్ ని మాండలే (బర్మా) కు తరలించారు. 1909 తిరిగి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. నిత్య జీవితంలో హిందీ భాష ఉపయోగాన్ని ప్రోత్సహించిన మొదటి భారతీయ నాయకుడు లాలాజీ.

1914లో కరాచీ కాంగ్రెస్ పంపిన ప్రతినిధి వర్గం సభ్యుడుగా ఇంగ్లండ్ వెళ్లి, భారత్ విషయంలో బ్రిటిషర్ల వైఖరిని నిరసించాడు. భారత స్వాతంత్య్రానికి విదేశాల మద్దతు కూడగట్టటం అవసరమని భావించి 1917లో అమెరికా చేరారు. అక్కడ భారతీయుల దుస్థితిని, ఆంగ్లేయుల దుష్టపాలనను, భారత జాతీయోద్యమానికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. న్యూయార్క్‌ నగరంలో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించారు. భారత దేశాన్ని బ్రిటన్ ఎలా దోపిడీ చేస్తుందనే విషయంపై లాలా రూపొందించిన నివేదికపై 1917లో అమెరికా సెనెట్‌లో చర్చ కూడా జరిగింది. 1919లో భారత్‌కు తిరిగి వచ్చాక… గాంధీజీతో కలిసి పనిచేశారు. 1920లో ఎన్‌.ఎం జోషి స్థాపించిన ఏఐటియుసి(ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్)కి అధ్యక్షత వహించాడు.

అదే ఏడాది భారత జాతీయ కాంగ్రెస్‌‌కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే గాంధీజీ అహింసా పద్ధతి బ్రిటిషర్లను కదిలించదని, కనుక గాంధీజీ ప్రకటించిన సహాయనిరాకరణ ఉద్యమం విఫలయ్యే ప్రమాదమే ఎక్కువని ముందుగానే బహిరంగంగానే సూచించారు. ఆ క్రమంలో చౌరీచౌరా సంఘటన తర్వాత గాంధీజీ ఈ ఉద్యమాన్ని మధ్యలోనే ఆపేయటంతో, గాంధీజీతో విభేదించినా, ఆ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని రెండేళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. భారతీయులంతా చదువుకోవాలని, అప్పుడే జాతి సంఘటితమవుతుందని భావించి లాహోర్‌లో నేషనల్ కాలేజీ ఏర్పాటు చేశారు. భగత్‌సింగ్‌ వంటి ఎందరో యువకులు అక్కడ చదువుకున్నారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌లాంటి వారూ లాలా అనుయాయులుగా మారారు. 1894లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును స్థాపించారు. లాహోర్‌లో తన తల్లి పేరిట క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేకంగా ఆసుపత్రి కట్టించి పేదలకు సేవలందించారు. తన అనుపమానమైన సేవలతో.. పంజాబ్ ప్రజల చేత ‘కేసరి’ అనే బిరుదును అందుకున్నారు.

1928, అక్టోబరు 30న లాహోర్ వచ్చిన సైమన్‌ కమిషన్‌‌లో ఒక్క భారతీయ ప్రతినిధి కూడా లేకపోవటాన్ని లాలా లజపతి రాయ్ నిరసించారు. ఈ కమిషన్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన నాయకత్వంలో లాహోర్‌లో బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం జరిగింది. ఉద్యమకారులంతా శాంతియుతంగానే నిరసన చేస్తుండగా, అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌ జేమ్స్‌ స్కాట్‌ తీవ్రంగా లాఠీఛార్జి చేయాలని ఆదేశించారు. ఆ ఘటనలో వయోధికుడని కూడా చూడకుండా లాలా లజపతి రాయ్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఈ దాడికి భగత్ సింగ్ వంటి ఉద్యమకారులూ నాడు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. అనంతరం గాయాలతో బాధపడుతూనే, అక్కడి కార్యకర్తలను ఉద్దేశించి లాలాజీ ప్రసంగించారు. ‘ఈరోజు నా ఒంటిపై పడిన ఒక్కో దెబ్బ.. భారత దేశంలోని బ్రిటిష్ సర్కారు అనే శవపేటిక మీద దిగబోయే పదునైన మేకులా మారుతుంది’అని గర్జించారు. అనంతరం గాయాలతో చికిత్స పొందుతూ 1928 నవంబరు 17న లాలాజీ కన్నుమూశారు. పోలీసు దెబ్బలవల్లే ఆయన మరణించారని వైద్యులిచ్చిన నివేదిక బ్రిటన్ పార్లమెంటులో ఆందోళనకు దారితీసింది. కానీ, బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని బుకాయించింది. కానీ… లాలాపై దాడికి ప్రత్యక్ష సాక్షులైన భగత్‌సింగ్‌ వంటి యువ ఉద్యమకారులు.. తర్వాతి రోజుల్లో అగ్గిపిడుగుల్లా మారి బ్రిటిష్ ప్రభుత్వానికి చెమటలు పట్టించటమే గాక.. తమ చైతన్యవంతమైన చర్యలతో భారతావనిలో స్వాతంత్ర్య ఆకాంక్షను రగిల్చారు. భారత స్వాతంత్య్రోద్యమానికి దశ దిశను నిర్దేశించి, తన జీవితకాలమంతా అవని భారతి సేవకే అర్పించిన ఆ మహానీయుని 160వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి.

ఇవి కూడా చదవండి: