Naxalism: అంపశయ్యపై వామపక్ష తీవ్రవాదం

Home Minister Amit Shah says Naxalism will end by March 2026: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు. చత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ అనంతరం ఆ ఘటనపై ఆయన స్పందించారు. ‘భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చివరి శ్వాసకు దగ్గరగా ఉంది. మావోయిస్ట్ విముక్త భారత్ కోసం సాయుధ బలగాలు అత్యంత ధైర్యసాహసాలతో 14 మంది మావోయిస్టులను నేల కూల్చారు’అని ఆయన వ్యాఖ్యానించారు. దండకారణ్యాన్ని విముక్తి చేయటానికి తలపెట్టిన ‘ఆపరేషన్ కగార్’ఆపరేషన్‌లో పాల్గొంటున్న భద్రతా దళాలను ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో భద్రతాదళాలు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ను మరింత ఉద్ధృతం చేశాయి. ఈ క్రమంలోనే ఒడిశా- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జయరాంరెడ్డి అలియాస్ చలపతిని హతమార్చిన భద్రతా దళాలు, మావోయిస్ట్ ఉద్యమంలోని అగ్రనేతలైన నంబాల కేశవరావు, మాడ్వి హిడ్మా, గణపతిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌పై రూ. 1.5 కోట్లు, మాడ్వి హిడ్మాపై రూ.కోటి, గణపతిపై రూ.2.5 కోట్ల రివార్డ్ ఉంది.
దేశ స్వాతంత్య్రానంతరం పలు ప్రాంతాల్లోని భూస్వాములు, జమీందార్లు పేద, శ్రామిక వర్గాల మీద చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా, తరాల తరబడి ఆ పెద్ద వర్గాల వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న పీడితుల విముక్తికై నాడు నక్సలిజం పుట్టింది. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ గ్రామంలో 1967 మే 24న చారుమజుందార్, కానూ సన్యాల్ నాయకత్వంలో అక్కడి నిరుపేద గిరజనులు, ఆదివాసీలు, శ్రామికులు తమను పీడిస్తున్న భూస్వాముల మీద తిరగబడ్డారు. ఈ ఘటనలో ఓ రైతు బాణం తగిలి ఒక పోలీసు చనిపోగా, మర్నాడు మే 25న పోలీసులు ఆ గ్రామంపై విరుచుకుపడి, ఇద్దరు పిల్లలతో సహా 11 మందిని కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయటంతో బాటు పలు చోట్ల భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు పుట్టుకొచ్చాయి. ఈ సాయుధ రైతాంగ పోరాటాలు బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్(శ్రీకాకుళం), మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్.. మరెన్నో చోట్ల పేద రైతులను పోరు బాటపట్టించాయి. దీంతో.. అప్పటివరకు సీపీఎం సభ్యులుగా ఉన్న చారుమజుందార్, కానూ సన్యాల్‌లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, సీపీఐ(మార్క్సిస్ట్ -లెనినిస్ట్) పార్టీని స్థాపించి, చైనా విప్లవ సారథి మావో బాటలో తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వారు పలు రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి పోరాడారు. ఈ క్రమంలో 1972లో చారుమజుందార్ పోలీసు కస్టడీలో చనిపోవడంతో ఉద్యమం బలహీనపడటమే గాక పార్టీ చీలికలు పేలికలైంది. ఈ క్రమంలో పీపుల్స్‌వార్ తదితర గ్రూపులు ఈ ఉద్యమాన్ని తమ సిద్ధాంతాలకు తగినట్లు ముందుకు తీసుకుపోయాయి. 2004లో పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కలసిపోయి.. సీపీఐ(మావోయిస్టు) పార్టీ అవతరించింది.
ఐదు దశాబ్దాల ఈ ఉద్యమంలో తొలి మూడు దశాబ్దాలు నక్సలైట్లు జనం మద్దతు పొందినా, 2004లో అది మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ప్రపంచీకరణ ప్రభావం, మారిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు దీనికి కారణాలుగా ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో యువత కొత్తగా ఈ మార్గంలో పయనించకపోవటం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా పలు కీలక ప్రాంతాల్లో మావోయిస్టుల బలాన్ని తగ్గించాయి. అదే సమయంలో కోవర్టు ఆపరేషన్లు పెరగటం, పార్టీ సానుభూతిపరులపైనా నిఘా పెంచటం వల్ల గత 20 ఏళ్లలో సుమారు 5249 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మైదాన ప్రాంతాల్లోని ఉద్యమకారులంతా ఇప్పుడు దండకారణ్యాన్ని కేంద్రంగా మలచుకుని ఒరిస్సా,ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, మహారాష్ట్రలలో తమ కార్యకలాపాలు సాగించే యత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 2004 నుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగటం, ఆపరేషన్ కగార్ తర్వాత ఈ దూకుడు మరింత పెరగటంతో గత రెండేళ్ల కాలంలో మావోయిస్ట్ ఉద్యమం భారీగా నష్టపోయింది.
ఇక.. ప్రస్తుతం మావోయిస్టులంతా మధ్య భారతంలోని దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. తెలంగాణ సరిహద్దులోని గోదావరి నది నుంచి.. ఒడిశాలో ఉన్న మహానది వరకు.. ఏపీ-ఒడిశా బోర్డర్‌లోని కొరాపుట్ నుంచి మధ్యప్రదేశ్ మీదగా మహారాష్ట్ర సరిహద్దులోని చంద్రపూర్ వరకు ఈ దండకారణ్యం విస్తరించి ఉంది. లంబాడీ, కోయ, గోండు, చెంచు, శంతల, సౌర, భూమిహార్, కొండ రెడ్లు ఇలా సుమారు 32 ఆదివాసీ, గిరిజన తెగల వారు ఇక్కడ జీవిస్తున్నారు. వీరంతా అడవి మీదనే ఆధారపడి జీవించే వారు కావటంతో, మావోయిస్టులు వీరి మద్దతుతో దండకారణ్యంలో పట్టుసాధించగలిగారు. ఈ దండకారణ్యంలోని విలువైన ఖనిజాల తవ్వకం పేరుతో బహుళజాతి కంపెనీలు అక్కడి వారిని నిర్వాసితులను చేస్తాయనే మావోయిస్టుల సూచన వల్ల అక్కడి వారంతా మావోయిస్టులకు అండగా నిలుస్తున్నారు. అలా.. గిరిజనుల అండతో మావోయిస్టులు, మావోయిస్టుల మద్దతుతో గిరిజనులు దండకారణ్యంలో మనుగడ సాగిస్తున్నారు. వీరికి అక్కడి అబూజ్‌మఢ్ కేంద్రస్థానంగా ఉండగా, బస్తర్ వంటి ప్రాంతాల్లోనూ వీరు పట్టుసాధించారు.
అయితే, ముల్లును ముల్లుతోనే తీయడం అనే వ్యూహంతో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి, పలు కారణాలతో లొంగిపోయిన మాజీలను డీఆర్‌జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్) బలగాల పేరుతో రంగంలోకి దించారు. దండకారణ్యంలోని 4 వేల చ.కి.మీ విస్తీర్ణంలోని అబూజ్‌మడ్ ప్రాంతంలో 8 వేల మందిని మొహరించారు. అయితే ఇప్పటికే సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో దాదాపు 650కి పైగా బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అక్కడి అడవి మీద గట్టి పట్టు, స్థానిక పరిచయాలున్న మాజీలతో డీఆర్‌జీ బలగాలను ముందుపెట్టుకుని కేంద్ర బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. మరోవైపు, ఎండాకాలంలో అడవంతా ఆకురాలిపోవటంతో, డ్రోన్ కెమెరాలు అక్కడి అణువణువునూ చిత్రీకరిస్తున్నాయి. మానవ సంచారం అతి తక్కువగా ఉండే ఆ దంకారణ్యంలో భూగర్భ సొరంగాల్లోనూ ఉండలేని స్థితి ఎదురుకావటంతో వారంతా సరిహద్దు రాష్ట్రాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటు తెలంగాణ, అటు ఒడిశా, మరోవైపు జార్ఖండ్, ఇటు మహారాష్ట్రలో తలదాచుకునేందుకు వెళ్లే క్రమంలో భద్రతా దళాలు కూంబింగ్ జరిపి, భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి. మావోయిస్టుల కదలికలపై సమాచారం వచ్చిందే తడవుగా..తక్కువ సమయంలో నిర్ధారిత ప్రాంతాలకు చేరి కూంబింగ్ ఆరంభించి, అబూజ్‌మఢ్ లాంటి కంచుకోటల్లో బలగాలు పాగా వేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం వచ్చే ఏడాది నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని నిజం చేసి తీరతాననే అభిప్రాయంలో ఉంది.