Minority Tofa Scheme: మైనారిటీ తోఫా స్కీమ్‌కు టెన్త్ సర్టిఫికెట్ లింక్ ఎందుకంటే.. సీఎం జగన్
పదవుల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విధాలుగా మైనార్టీలకు న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గుంటూరులో జరిగిన మైనారిటీ సంక్షేమదినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని అన్నారు.
Andhra Pradesh News: పదవుల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విధాలుగా మైనార్టీలకు న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గుంటూరులో జరిగిన మైనారిటీ సంక్షేమదినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని అన్నారు. నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చామని తెలిపారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవిని మైనారిటీకి కేటాయించామని చెప్పారు.
మైనారిటీ తోఫా స్కీమ్‌కు సంబంధించి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసేస్తే ముస్లిం సోదరీమణులు చదువుకునే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతి ముస్లిం సోదరి, సోదరుడు చదవుకుని ప్రపంచంతో పోటీ పడి గెలవాలని ఆకాక్షించారు. చదవు అనే అస్త్రం లేకుంటే.. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేరని అన్నారు. విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు చేస్తున్నామని చెప్పారు. మైనారిటీ తోఫాకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంచడంతో.. టెన్త్ క్లాస్ వరకు చదివించే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ. 10,309 కోట్లు అందించామని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 10 వేల కోట్లు అందించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో మైనారిటీలకు రూ. 2,665 కోట్లు ఇస్తే.. తాము మూడేళ్లలోనే రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని సీఎం జగన్ తెలిపారు.