Chandrababu Naidu : ఆసక్తిగా కుప్పంలో చంద్రబాబు మూడో రోజు పర్యటన… పోలీసులు తీరుపై డీజీపీకి లేఖ
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత రెండు రోజులు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగిన బాబు పర్యటన నేడు మూడో రోజుకి చేరింది.
Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత రెండు రోజులు ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సాగిన బాబు పర్యటన నేడు మూడో రోజుకి చేరింది. జీవో 1 అమలఉ ఉన్నందున రోడ్ షో లకు పోలీసులు అనుమతి ఇవ్వనందున తెదేపాకు పోలీసులకు తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేయడం… పోలీసులపై తెదేపా కార్యకర్తలు దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
కాగా ఈ మేరకు కుప్పం ఘటనలపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం పర్యటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపామని చెప్పారు. పోలీసులు తన పర్యటనకు పలుసార్లు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. తమ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పెద్దూరులో తనను పోలీసు బలగాలతో అడ్డుకున్నారు. తన పర్యటనకు భద్రత కల్పించడంలో జిల్లా ఎస్పీ విఫలమయ్యారని చంద్రబాబు తెలిపారు. జీవో నంబర్ 1 ప్రకారం టూర్ కు ప్రత్యమ్నాయ ప్రదేశం చూపడంలో పోలీసులు విఫలమయ్యారని వివరించారు.
గ్రామాలలో సభలు నిర్వహించుకుంటామని లేఖలో పేర్కొన్నారు. స్థలాలు ప్రజా జీవనానికి ఎటువంటి భంగం కలిగించేవి కావని చెప్పారు. గతంలో కూడా తన టూర్ సమయంలో జిల్లా ఎస్పీ సరైన భద్రతా ఏర్పాటు చేయకుండా శాంతిభధ్రతల విఘాతం కలిగించారని గుర్తు చేశారు. విధులు సరిగా నిర్వర్తించని చిత్తూరు ఎస్పీపై, పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా తన నియోజకవర్గం కుప్పం ప్రజలతో సమావేశమయ్యేందుకు తగిన అనుమతులు ఇచ్చేలా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాలని డిమాండ్ చేశారు.