Earthquakes: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో ప్రజలు పరుగులు
Earthquakes in telugu states: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం 7.27 నిమిషాలకు పలు సెకన్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపలపల్లి, చిర్ల, రంగారెడ్డి, వరంగల్, చింతకాని, భద్రాచలం ప్రాంతాలతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, విశాఖపట్నం, అక్కయ్యపాలెం, తిరువూరు, నందిగామ, పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్ మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, తెలంగాణలోని ములుగు ప్రాంతంలోని మేడారం వద్ద భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా గుర్తించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప ప్రభావంతో సెస్మిక్ జోన్-2లో హైదాబాద్ ఉంది. అయితే జోన్-5లో అత్యంత ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జోన్-2లో ఉండడంతో తక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సింగరేణి కోల్‌బెల్ట్ వద్ద కూడా భూకంపం కంపించింది. అయితే కోల్‌బెల్ట్ వద్ద ఇంత తీవ్రత రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1969 లో భద్రాచలంలో భూప్రంకపనలు నమోదయ్యాయి. ఇక, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోనూ భూప్రకంపనలు వచ్చాయి.
కాగా, ఇటీవల ములుగు జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో పలు చెట్లు ధ్వంసమయ్యాయి. సుమారు 50వేలకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ వరదల బీభత్సానికి పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు రాహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.