Published On:

Donald Trump – Xi Jinping: అగ్ర నేతల మీటింగ్.. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ మీటింగ్..?

Donald Trump – Xi Jinping: అగ్ర నేతల మీటింగ్.. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ మీటింగ్..?

Donald Trump direct meeting with China President Xi Jinping on tariffs: అమెరికా – చైనా మధ్య ఇటీవల ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తుందని అమెరికా అరోపించింది. అయితే అమెరికా ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. దీంతో వ్యవహారాన్ని ముఖాముఖి తేల్చుకోవాలని డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ డిసైడ్ అయ్యారు. వారంరోజుల్లో ఈ కీలక సమావేశం జరిగే అవకాశాలున్నాయి.

అమెరికా -చైనా మధ్య ఎప్పుడు ప్రేమ చిగురిస్తుందో.. ఎప్పుడు యుద్ధ ఘంటికలు మోగుతాయో ఎవరూ చెప్పలేరు. రెండు దేశాల మధ్య ఒక వారం హనీమూన్ నడిస్తే.. ఆ తరువాతి వారం సంబంధాలు హాట్ హాట్ గా మారతాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రపంచ దేశాలను ఆగమాగం చేయడంలో ఆయన బిజీగా ఉన్నాడు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం.. సుంకాలు. దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలపై ఆయన భారీ ఎత్తున సుంకాలు విధించాడు. లిబరేషన్ డే పేరుతో ఈ సుంకాల వడ్డింపును ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. ఈ జాబితాలో చైనా కూడా చేరింది.
అయితే అమెరికా విధించిన సుంకాలను చైనా చాలా తీవ్రంగా ప్రతిఘటించింది.

 

ప్రపంచదేశాలతో వ్యవహరించే తీరు ఇది కాదంటూ అమెరికాపై కారాలు, మిరియాలు నూరింది. ఆ తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. కాగా దాదాపు నెల రోజుల కిందట చైనాపై సుంకాలను 145 శాతానికి అమెరికా పెంచింది. దీంతో అమెరికా పై చైనా మండిపడింది. ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించింది చైనా. అయితే చైనా ఇలా అమెరికా మీద కౌంటర్ సుంకాలు విధించడం ట్రంప్ మహాశయుడికి నచ్చలేదు. అంతేకాదు….సుంకాల విషయంలో అమెరికాతో యుద్ధానికి తాము సన్నద్దంగా ఉన్నామని చైనా అధినేత జిన్ పింగ్ వెల్లడించారు. అవసరమైతే ఎంతకైనా తాము తెగిస్తామని అమెరికా ను జిన్ పింగ్ హెచ్చరించారు.

 

సుంకాల విషయంలో చైనా అడ్డం తిరగడంతో .. ఏమనుకున్నారో .. ఏమో కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. చైనా తో గొడవలు మంచివి కావని డిసైడ్ అయినట్లున్నారు. దీంతో చైనాతో ట్రేడ్ డీల్ కు అమెరికా శ్రీకారం చుట్టింది.మౌలికంగా అమెరికా ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ ట్రేడ్ డీల్ ను ట్రంప్ సర్కార్ రూపొందించింది. కాగా జిన్ పింగ్ కూడా వెనక్కి తగ్గారు. రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. అమెరికా తో ట్రేడ్ డీల్ కు జిన్ పింగ్ సై అన్నారు. ఇంకేముంది.. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా – చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది.

 

అంతా బాగానే ఉంది అనుకునేలోపు.. ట్రంప్ మహాశయుడు ఓ బాంబు పేల్చాడు. ట్రేడ్ డీల్ ఒప్పందానికి చైనా తూట్లు పొడుస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఘాటు ఆరోపణలు చేశారు. ట్రంప్ ఆరోపణలకు చైనా అధినేత జిన్ పింగ్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి చైనా కట్టుబడి ఉందని జిన్ పింగ్ క్లారిటీ ఇచ్చారు. అమెరికా తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తోందని ఎదురు దాడి చేశాడు.

 

ఈ నేపథ్యంలో జిన్ పింగ్ తో ముఖాముఖి మాట్లాడాలన్న నిర్ణయానికి వచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారం రోజుల్లోపల ఇద్దరు దేశాధినేతల సమావేశం ఉండే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఈ విషయం వెల్లడించారు. ట్రేడ్ డీల్ తో పాటు ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడం వంటి అనేక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తాయని కరోలిన్ లివిట్ వెల్లడించారు.

 

ఏమైనా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దూకుడు తగ్గించుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.