Chhaava Collection: ‘ఛావా’ తెలుగు ఫస్డ్ డే కలెక్షన్స్ – డబ్బింగ్ చిత్రానికి ఊహించని ఒపెనింగ్, ఎంతంటే!

Chhaava Telugu Day 1 Collection: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఛావా’ తెలుగులో రిలీజైంది. టాలెంటెడ్ యాక్టర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు ఈ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడంతో సౌత్ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఛావా దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయాలని కోరారు.
ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఫుల్ డిమాండ్ రావడంతో గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. మూవీ రైట్స్ తీసుకుని మార్చి 7న సినిమా తెలుగు వెర్షన్‌ని విడుదల చేశారు. హిస్టారికల్ నేపథ్య మూవీ కావడంతో సినిమా చూసేందుకు ఆడియన్స్ తెగ ఆసక్తి చూపించారు. హిందీలో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ రావడంతో తెలుగులో ఛావా ఫస్ట్‌డే మంచి వసూళ్లనే రాబట్టినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజు ఈ సినిమా రూ. 3.03 కోట్లు వసూళ్లు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.
ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడమంటే రికార్డే అని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వీకెండ్ కావడంతో మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి చూడాలి ఛావా తెలుగు వెర్షన్ ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో. ఛావా మూవీ కథ విషయానికి వస్తే.. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపించింది. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.