Tata Technologies: 18 ఏళ్ల తర్వాత ఐపీఓకు టాటా టెక్నాలజీస్
2004 లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్ ఇష్యూకు తెచ్చింది టాటా గ్రూప్. అనంతరం 18 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా టెక్నాలజీస్
Tata Technologies: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కు రాబోతోంది. ఈ మేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. టాటా మోటార్స్ సహా మరో ఇద్దరు ఇన్వెస్టర్లు 23.6 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
2004 లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను పబ్లిక్ ఇష్యూకు తెచ్చింది టాటా గ్రూప్. అనంతరం 18 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా టెక్నాలజీస్ ను ఐపీఓకు తీసుకొచ్చింది.
రూ. 3,800 కోట్లకు ఐపీఓ?( Tata Technologies)
ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కిందే జరగనుంది. టాటా మోటార్స్ కు చెందిన 8,11,33,706 షేర్లు, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ కు చెందిన 97,16,853 షేర్లు,
టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 48,58,425 షేర్లను వదులుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఈ ఐపీఓ ద్వారా ఎంత మొత్తం నిధులను సమీకరించాలనుకునేది మాత్రం తెలియలేదు.
ఇటీవల టాటా టెక్ బైబ్యాక్ ప్రకారం కంపెనీ విలువను రూ. 16,080 కోట్లుగా అంచనా వేశారు.
దాని ప్రకారం.. తాజా ఐపీఓ పరిమాణం రూ. 3,800 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ప్రొడక్ట్ ఇంజినీరింగ్, డిజిటల్ సేవల్లో సంస్థ
సీఈఓ వారెన్ హ్యారిస్ నేతృత్వం వహిస్తున్న టాటా టెక్నాలజీస్ ఒక ప్రొడక్ట్ ఇంజినీరింగ్, డిజిటల్ సేవల సంస్థ. ఈ సంస్థలో 11,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు టాటా టెక్నాలజీస్ సేవలందిస్తోంది. ఈ సంస్ధలో 2022 మార్చి 31 నాటికి టాటా మోటార్స్‌కు 72.48 శాతం వాటా ఉంది.
ఆల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్లకు వరుసగా 8.96 శాతం, 4.48 శాతం వాటాలున్నాయి.
టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా ఎంటర్ ప్రైజెస్ ఓవర్సీస్, జెడ్రా కార్పొరేట్ సర్వీసెస్, ప్యాట్రిక్ రేమాన్ మెక్గోల్డ్రిక్ సంస్థలకు మిగిలిన వాటాలున్నాయి.
2022 డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయం రూ. 3,052.29 కోట్లుగా ఉంది. నికర లాభం రూ. 407 కోట్లకు చేరింది.
కంపెనీకి 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలతో పాటు ఇంజినీరింగ్, పరిశోధన- అభివృద్ధి సేవలు, డిజిటల్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ ,
ఎడ్యుకేషన్ ఆఫరింగ్స్, వాల్యూ యాడెడ్ రీసెల్లింగ్ అండ్ ఐప్రొడక్ట్స్ ఆఫరింగ్స్ విభాగాల్లో వ్యాపారాలున్నాయి.