Atal Pension Yojana: భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ. 10 వేల పెన్షన్.. ఆ పథకమేంటో తెలుసా ?

Atal Pension Yojana: కోట్లాది మంది శ్రామిక ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పథకం లక్ష్యం వృద్ధాప్యంలో దిగువ, మధ్యతరగతి ప్రజలకు హామీతో కూడిన నెలవారీ పెన్షన్ అందించడం. పదవీ విరమణ తర్వాత జీవితానికి.. ముందుగానే ఆర్థిక ప్రణాళిక చేసుకోకపోతే, భవిష్యత్తులో మీరు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఇలాంటి వారికి ఉపయోగపడే ఒక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టిన తర్వాత.. మీకు 60 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి నెలా 5 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. కోట్లాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ పథకాన్ని 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వృద్ధాప్యంలో దిగువ , మధ్యతరగతి ప్రజలకు హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్‌ను ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం.
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అటల్ పెన్షన్ యోజనలో అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ పథకంలో మీరు నమోదు చేసుకున్న వయస్సు ప్రకారం పెట్టుబడి మొత్తం కూడా నిర్ణయించబడుతుంది. మీ 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. మీరు ప్రతి నెలా రూ. 210 పెట్టుబడి పెట్టాలి. మీరు 60 సంవత్సరాల వయస్సు వరకు ఈ పెట్టుబడిని కొనసాగించాలి. 60 సంవత్సరాల వయస్సు తర్వాత.. మీకు ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్ లభిస్తుంది.
భార్య, భర్త ఇద్దరూ కలిసి ఈ పథకంలో దరఖాస్తు చేసుకుని పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీ ఇద్దరికీ 60 సంవత్సరాల వయస్సు తర్వాత ఒక్కొక్కరికి రూ. 5,000 పెన్షన్ లభిస్తుంది. ఇద్దిరకీ కలిపి మొత్తం రూ. 10,000 పెన్షన్ వస్తుంది. మీరు మీ సమీపంలోని బ్యాంకును సందర్శించి అటల్ పెన్షన్ యోజనలో ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు, మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ ఖాతాకు తప్పకుండా లింక్ చేయించుకుని ఉండాలి.