viduthala telugu review: వెట్రిమారన్ సినిమాలు అంటే.. పెద్దగా చెప్పనక్కర్లేదు. వెట్రిమారన్ సినిమాలు.. అణగారిన వర్గాల గొంతుకలు. వివక్షకు వ్యతిరేక పతాకాలు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు కమర్షియల్ సినిమాలకు చాలా దూరం. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా విడుదల పార్ట్ -1. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే?
నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీశ్రీ, గౌతమ్ వాసుదేవ మేనన్, రాజీవ్ మేనన్ తదితరులు; సంగీతం: ఇళయరాజా; సినిమాటోగ్రఫీ: ఆర్.వేల్‌రాజ్; ఎడిటింగ్: రమర్; నిర్మాత: ఎల్రెడ్ కుమార్; రచన, దర్శకత్వం: వెట్రిమారన్.
వెట్రిమారన్… తమిళనాట ఈ పేరు ఓ సంచలనం. వెట్రిమారన్ సినిమా వస్తుందంటే చాలు.. అంచనాలు పెరిగిపోతుంటాయి. స్టార్ల కంటే కూడా కథలకే పెద్దపీట వేస్తూ సినిమాలు తీయడం ఆయన శైలి. మరి ‘విడుదల: పార్ట్1’ ఎలా ఉంది. ఈ సినిమా కథేంటి? వెట్రిమారన్ టేకింగ్ ఎలా ఉంది?
కుమరేషన్ అనే గ్రామీణ ప్రాంత యువకుడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరుతాడు. ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్(విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ దళంలో డ్రైవర్ గా చేరుతాడు. కుమరేషన్ నిజాయితీ, ముక్కుసూటితనం గల వ్యక్తి. తప్పు చేయనపుడు సారీ చెప్పనని మెుండికేసే రకం. ఈ క్రమంలో (భవానీ శ్రీ) అనే గ్రామీణ యువతితో ప్రేమలో పడతాడు. ఈ సమయంలో..
తీవ్రవాద నాయకుడు (విజయ్ సేతుపతి) ఆచూకీ కోసం మహిళలను హింసిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో పెరుమాల్ ఆచూకీ తనకి తెలుసని.. తాను పట్టుకుంటానని ఉన్నతాధికారి మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్)ను కోరడంతో అందుకు అంగీకరిస్తారు. ఒక పక్క ప్రేమ, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి సంఘర్షణకి గురవుతాడన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే: వెట్రిమారన్ మట్టి కథలకి పెట్టింది పేరు. మట్టి మనుషులే ఆయన సినిమాకు ప్రధాన బలం.
నటనను సహజంగా తెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని లీనం చేయడం ఆయన శైలి. ఈ సినిమాతోనూ అదే ప్రయత్నం చేశాడు.
1987 నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో అడవుల్ని చూపించిన తీరు అమోఘం.
కుమరేశన్ విధులు నిర్వర్తించే తీరు… ఆ క్రమంలో ఎదురయ్యే అనుభవాలు ప్రేక్షకుడిలో ఆసక్తిని కలగిస్తాయి.
అడవుల్లో పోలీసులు చేసే ప్రయత్నాలు నచ్చుతాయి. విజయ్ సేతుపతి కోసం సాగే వేటలో వచ్చే సన్నివేశాలను సహజంగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా మహిళల నేపథ్యంలో సాగే ఆ సన్నివేశాల్ని దర్శకుడు తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చారు.
ఇక చివర్లో వచ్చే పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వాటితోనే పార్ట్-2పై ఆసక్తిని పెంచారు.
ఎవరెలా చేశారంటే: వెట్రిమారన్ పాత్రలకి తగిన నటులను ఎంపిక చేసుకున్నారు. సూరి, విజయ్ సేతుపతి నటనే సినిమాకు ప్రధాన బలం.
విజయ్ సేతుపతి కనిపించేది కొన్ని సన్నివేశాల్లో అయిన.. ఆ ప్రభావం సినిమా మెుత్తం ఉంటుంది.
గౌతమ్ మేనన్, రాజీవ్ మీనన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.
ఇది పీరియాడిక్ సినిమా కావడంతో గతాన్ని గుర్తు చేసేలా నేపథ్య సంగీతం అందించారు ఇళయరాజా. పాటలు ఆకట్టుకుంటాయి. కెమెరా పనితనం మెప్పిస్తుంది.
బలాలు: + కథా ప్రపంచం; +నటీనటులు; + పతాక సన్నివేశాలు
బలహీనతలు: – సంఘర్షణ లేని కథ; – సాగదీతగా ప్రథమార్ధం
చివరిగా: విడుదల.. వెట్రిమారన్ మార్క్ మూవీ!