Last Updated:

Moonlighting: ఐటీ కంపెనీలకు తలనొప్పిగా మారిన ’మూన్‌లైట్‌‘

ఇటీవల కాలంలో మూన్‌లైట్‌ పదం చాలా మంది వినే ఉంటారు. తాజాగా విప్రో 300 ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా మూన్‌లైట్‌కు పాల్పడుతున్నారని యాజమాన్యం వీరిని ఉద్యోగంలోంచి తొలగించింది.

Moonlighting: ఐటీ కంపెనీలకు తలనొప్పిగా మారిన ’మూన్‌లైట్‌‘

Prime9Special: ఇటీవల కాలంలో మూన్‌లైట్‌ పదం చాలా మంది వినే ఉంటారు. తాజాగా విప్రో 300 ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా మూన్‌లైట్‌కు పాల్పడుతున్నారని యాజమాన్యం వీరిని ఉద్యోగంలోంచి తొలగించింది. విప్రో నిర్ణయంతో ఐటీ రంగంలో కలవరం రేగింది. ఇంతకు మూన్‌ లైట్‌ అంటే ఏమిటి? ఒక ఉద్యోగి ఒక సంస్థలో పనిచేస్తూ, వేరే కంపెనీలో పనిచేయడాన్ని మూన్‌లైట్‌ అంటారు. లాక్‌డౌన్‌ తర్వాత మూన్‌లైటింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. ఎవరైనా ఒక ఉద్యోగి ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటాడు. సంపాదన సరిపోకపోతే, కుటుంబ పోషణ కోసం అదనపు ఉద్యోగాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నైతికంగా ఇది తప్పే అయినా, కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు సవరిస్తే కొంత వరకు మూన్‌లైట్‌కు అడ్డుకట్టవేయవచ్చు. అటు తర్వాత యాజమాన్యాలు ఉద్యోగులకు నైతికత, చట్టబద్దత గురించి తెలియజేసి, మూన్‌లైటింగ్‌కు అడ్డకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది.

ఇటీవల ఐటి దిగ్గజం విప్రో సుమారు 300 మంది ఉద్యోగుల పై వేటు వేసింది. వీరంతా తమ సంస్థలో పనిచేస్తూ, ఇక్కడ జీతం తీసుకుంటూ ఇతర కంపెనీలకు పనిచేస్తున్నారని తెలుసుకొని వారిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. విప్రో తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా మూన్‌లైన్‌ అంశంపై చర్చ మొదలైంది. ఒక ఉద్యోగం చేస్తూ అదనపు సంపాదనకు మరో ఉద్యోగం చేయడం సుదీర్ఘకాలంగా జరుగుతున్న తంతే. అయితే ఐటి కంపెనీలు మాత్రం మూన్‌లైటింగ్‌ అనైతికమని, చట్ట వ్యతిరేకమని, ఐపీతో పాటు సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నట్లేనని చెబుతున్నాయి. ఒక వేళ కంపెనీలు దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా, రాత్రికి రాత్రి ఈ మూన్‌లైటింగ్‌ అనే జాఢ్యం మాత్రం సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. మూన్‌లైటింగ్‌ అనేది బహిరంగ రహస్యమే. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నతంతే. ముఖ్యంగా ఐటి రంగంలో ఈ జాడ్యం ఎక్కువగా ఉంది. అయితే ఇటీవల కాలంలో ఐటి రంగంలో మూన్‌లైటింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా ఐటి ఉద్యోగులు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల పాటు పనిచేస్తారు. వారానికి ఐదు రోజుల పాటు పనిచేస్తారు. పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో అయితే తొమ్మిదన్నర గంటల పాటు ఆఫీసులో పనిచేసి ఈ ట్రాఫిక్‌లో గంటల కొద్ది ప్రయాణం చేసే ఇంటికి చేరుకొనే సరికి నీరసపడిపోతారు. దీంతో ఉద్యోగి ఉన్న ఐటి కంపెనీని వదిలి ఇతర ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తాడు.

కరోనా మహమ్మారి తర్వాత నుంచి డిజిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యాపారాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోయింది. చిన్న, పెద్ద కంపెనీలు ఆన్‌లైన్‌కు మారిపోయాయి. కోవిడ్‌ తర్వాత చాలా మంది ఇంటి నుంచి కాలు కదపకుండా ఆన్‌లైన్‌ ద్వారానే తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఐటి కంపెనీలకు బాగా కలిసివచ్చాయి. దీంతో అకస్మాత్తుగా ఐటి నిపుణులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఎవరూ ఎన్ని విధాలుగా వాదించినా, చివరకు ప్రతి ఒక్కరూ పనిచేసేది డబ్బు కోసమే అనేది మాత్రం వాస్తవం. భారతీయ ఐటి నిపుణులు ప్రధానంగా విదేశాల్లో తాను ఈ పనిచేస్తే ఎంత వేతనం వస్తుందో సరిపోల్చి చూసుకుంటారు. అమెరికాతో పాటు యూరోప్‌ మార్కెట్లో ఇదే పనికి ఎంత వేతనం లభిస్తుందో లెక్కేసుకుంటాడు. విదేశీ మార్కెట్లతో పోల్చుకుంటే భారత ఐటి నిపుణులకు ఇచ్చే జీతం తక్కువే అని చెప్పాలి. దీంతో పాటు మన దేశంలో ఐటి రంగంలో ఎంట్రీ లెవెల్‌లోప్రవేశించే వారి జీతం గత దశాబ్దం నుంచి ముందు కదిలిన ఉదాంతాలు లేనే లేవు. దీంతో పాటు దశాబ్దం క్రితం నాటి ద్రవ్యోల్బణానికి ప్రస్తుతం ఉన్న ధరలకు ఎక్కడా పోలికే లేదు. ఇదే విషయాన్ని ఐటి రంగానికి చెందిన సీనియర్‌ లీడర్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఎంట్రీ లెవెల్‌ ఐటి నిపుణుల పట్ల అన్యాయం జరుగుతోందని వారు కూడా వాపోతున్నారు.

ఇక ఐటి రంగానికి చెందిన మిడ్‌ లెవెల్‌ ఉద్యోగులు మన దేశంలో సుమారు 50 లక్షల మంది పనిచేస్తుంటారు. ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో పనిచేసే వీరి వేతనాలు కరోనా మహమ్మారి సమయంలో స్వల్పంగా పెరిగాయి. అయితే కరోనా వీరికి ఆయాచితవరంగా మారింది. ఐటి నిపుణులకు అకస్మాత్తుగా ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చి పడింది. దీంతో ఉద్యోగులు తాము చేసే కంపెనీలు రాజీనామా చేసి కొత్త ఉద్యోగంలో చేరిపోయారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏకంగా 30 శాతం మంది వరకు ఐటి కంపెనీల్లో వలసలు పెరిగినట్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఐటి రంగానికి చెందిన ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. కరోనా తర్వాత వర్క్‌ఫ్రం హోం విధానం అమల్లోకి రావడం కూడా ఐటి ఉద్యోగులకు బాగా కలిసి వచ్చింది. వీరంతా దేశీయ ఐటి కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ కంపెనీలకు కూడా సేవలందించడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే దేశంలో కొత్త స్టార్టప్‌ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. ఈ స్టార్టప్‌ కంపెనీలు మళ్లీ ఈ ఐటి నిపుణల సేవలనే వినియోగించుకుంటున్నాయి. అతి పెద్ద టెక్నాలజీ కంపెనీలు సీనియర్లను తీసుకొని తమ స్టార్టప్‌ కంపెనీలను నడుపుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి: