Pahalgam : పహల్గాం టూరిస్టులను చంపిన ఉగ్రవాదుల ఫోటోలు ఇవే!

Pahalgam : కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. దాడి చేసిన దుండగుల ఫొటో స్కెచ్ లను భారత ఆర్మీ విడుదల చేసింది. వీరిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ( LET)కు అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ ఘటనకు పాల్పడింది. ఆర్మీ యునిఫాం ధరించిన ఉగ్రవాదులు పహల్గాంలో పర్యటిస్తున్నవారిని లక్షంగా చేసుకుని కాల్పులు జరిపారు. కాశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడుల్లో ఇది ఒకటి.
కనీసం 5–6 మంది ఉగ్రవాదులు, ఆర్మీ దుస్తులు, కుర్తా-పైజామాలు ధరించి ఉన్నారు. లోయ చుట్టూ ఉన్న దట్టమైన అడవి గుండా పర్యటకులు ఉన్న ప్రదేశానికి వచ్చి AK-47 లతో కాల్పులు జరిపారు. దాడికి కొన్ని రోజుల ముందు లోయలోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడినట్టుగా నిఘావర్గాలు తెలిపాయి. ఈ మారణానికి ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి, అలియాస్ ఖలీద్. ఇతను ఎల్ఈటి టాప్ కమాండర్ గా పనిచేశాడు. ఉగ్రవాదులను ఏరివేయడానికి హెలికాప్టర్లను భారత ఆర్మ మోహరించింది.
ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణతోపాటు బాధితుల సాక్ష్యాలను అధికారులు సేకరించారు. ఉగ్రవాదులు వాడిన ఆయుధాలు, మ్యప్ లు మరియు అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను సైనికులు ఉపయోగించేవిగా గుర్తించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, కరాచీకి చెందిన వారుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
టూరిస్టులపై జరిగిన దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా టూర్ ను రద్దు చేసుకుని బుధవారం ఉదయం భారత్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలోనే కేంద్ర మంత్రి జైశంకర్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన వారిని వదలబోమని చెప్పారు.