Published On:

FASTag: పంద్రాగస్టు నుంచి ఫాస్టాగ్‌ ఇయర్‌ పాస్‌.. దరఖాస్తు ఎలా అంటే?

FASTag: పంద్రాగస్టు నుంచి ఫాస్టాగ్‌ ఇయర్‌ పాస్‌.. దరఖాస్తు ఎలా అంటే?

FASTag Year Pass from August 15: ‘నేషనల్ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)’ నూతన ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. తరచుగా హైవేలను వినియోగించే వారికి టోల్ ఫీజు చెల్లింపు ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా వార్షిక పాస్‌‌ను తీసుకొచ్చారు. పాస్ ఇంకా అందుబాటులోకి రానప్పటికీ, ధర, వినియోగ పరిమితులు, చెల్లుబాటు లాంటి వివరాలతో ఎన్‌హెచ్‌ఏఐ దాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు చేసింది.

 

ఈ ఏడాది పంద్రాగస్టు సందర్భంగా కొత్త పాస్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించారు. అర్హత కలిగిన వినియోగదారులు ఒకేసారి రూ.3వేల రుసుం చెల్లించి 200 టోల్-ఫ్రీ ట్రిప్పులు లేదా ఏడాది వరకు వ్యాలిడిటీ ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపల 200 ట్రిప్పులు పూర్తయితే పాస్‌ చెల్లుబాటు ముగుస్తుంది. పాస్‌ పరిమితి అయిపోయిన తర్వాత ఫాస్టాగ్ ఎప్పటిలాగే సాధారణ పే ఫర్‌ యూజ్ సిస్టమ్‌కు తిరిగి వస్తుంది.

 

ఎవరు అర్హులు?..
-ఫాస్టాగ్ వార్షిక పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వాణిజ్య లేదా గూడ్స్‌ వాహనాల కోసం కాదు.
-ఫాస్టాగ్ పాస్‌ అర్హత కోసం వాహనంలో యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి.
-ఫాస్టాగ్‌ను కేవలం ఛాసిస్ నంబర్‌తో కాకుండా పూర్తి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (వీఆర్‌ఎన్)కి లింక్ చేయాలి.
-ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్ చేయకూడదు. దానికి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉండకూడదు.
-తాత్కాలిక నంబర్లు ఉన్న వినియోగదారులు దరఖాస్తు చేసుకునే ముందు వారి ఫాస్ట్‌ట్యాగ్ వివరాలను అప్‌డేట్ చేయాలి.

 

పాస్ ఎక్కడ పని చేస్తుంది?..
ఎన్‌హెచ్‌ఏఐ నేరుగా నిర్వహించే టోల్ ప్లాజాల్లో మాత్రమే పాస్ చెల్లుతుంది. రాష్ట్ర రహదారులు, ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రోడ్లు, రాష్ట్ర నిర్వహణ ఎక్స్‌ప్రెస్‌ వేలలో పాస్‌ చెల్లదు. పాస్ కొనుగోలు చేసేముందు వినియోగదారులు రెగ్యులర్‌గా ప్రయాణించే రహదారులు ఎన్‌హెచ్‌ఏఐ అధికార పరిధిలోకి వస్తాయో లేదో తనిఖీ చేసుకోవాలి.

 

దరఖాస్తు ఎలా?..
ఆగస్టు 15వ తేదీ నుంచి వినియోగదారులు ‘రాజ్‌మార్గ్ యాత్ర’ మొబైల్ యాప్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వెబ్‌సైట్ లాంటి అధికారిక ప్లాట్‌ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయంలో మోసపోకుండా థర్డ్‌ పార్టీ యాప్‌లు, వెబ్‌సైట్ల జోలికి వెళ్లొద్దు.

 

దరఖాస్తు దశలు..
-ముందుగా ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉందా లేదా..? చెల్లుబాటు అయ్యే VRNకి లింక్ చేయబడిందా లేదా..? అనేది నిర్ధారించుకోండి.
-తర్వాత పైన పేర్కొన్న ఏదైనా అధికారిక ప్లాట్‌ఫామ్‌ను సందర్శించండి.
-అక్కడ వాహనం, ఫాస్టాగ్ వివరాలను నమోదు చేయండి.
-డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా రూ.3వేల ఒకేసారి రుసుం చెల్లించండి.
-వెంటనే మీకు కన్ఫర్మేషన్‌ వస్తుంది. తర్వాత ఎస్‌ఎంఎస్ ద్వారా యాక్టివేట్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి: