Karnataka: కొవిడ్ వ్యాక్సిన్‌పై ఆరోపణలు.. సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలి: బీజేపీ

BJP fires on CM Siddaramaiah: కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఇటీవల 20 మంది మృతిచెందారు. వారి మృతికి కొవిడ్ టీకాలు కారణమని చెప్పేందుకు ఆధారాలు లేవని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇటీవల హసన్ జిల్లాలో 20 మంది గుండెపోటుతో మృతిచెందారు. మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్ కారణం అయి ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. మరణాలకు గల కారణాలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిది.
వివిధ కోణాల్లో దర్యాప్తు..
నిపుణుల బృందం వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. మరణాల వెనుక పలు కారణాలు ఉన్నట్లు తేల్చింది. జన్యు, మానసిక, పర్యావరణ సంబంధిత కారణాలతో 20 మందిలో గుండె సమస్య తలెత్తినట్లు పేర్కొంది. మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్ కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. హుబ్బళిలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై జోషి మాట్లాడారు.
భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలు కొవిడ్-19 వ్యాక్సిన్‌కు గుండె సమస్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధాని మోదీ హయాంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారన్న అక్కసుతోనే సిద్ధరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
కొవిడ్ వ్యాప్తికి ప్రధాని మోదీ అడ్డు కట్టవేయలేరని కాంగ్రెస్ పార్టీ భావించిందని జోషి తెలిపారు. ప్రజలంతా ఆయనకు ఎదురు తిరుగుతారని కాంగ్రెస్ నేతలు అనుకున్నారని తెలిపారు. కానీ, వారి అంచనాలు ఫలించలేదన్నారు. కరోనాను సమర్థంగా అడ్డుకున్నందుకు ప్రపంచవ్యాప్తంగా మోదీకి ప్రశంసలు వెల్లువెత్తాయన్నారు. అది ఓర్చుకోలేకనే, కాంగ్రెస్ నేతలు నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
గుండె పోటుకు, కొవిడ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ, ఎయిమ్స్ తదితర సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన నిపుణులతో కర్ణాటక సర్కారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు వాళ్లు కూడా అదే విషయాన్ని మరోసారి చెప్పారన్నారు. మరి సిద్ధరామయ్య క్షమాపణలు చెబుతారా?ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జోషి అన్నారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సీఎన్. అశ్వత్ నారాయణ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లను అప్రతిష్ఠపాలు చేసేలా సిద్ధరామయ్య వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.