Big Jolt to Nitish Kumar: నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. 65 శాతం రిజర్వేషన్లు కోటాను రద్దు చేసిన పాట్నా హైకోర్టు
బిహార్‌లో నితీష్‌కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది నవంబర్‌లో రిజర్వేషన్ చట్టాన్ని సవరించి మొత్తం రిజర్వేషన్ కోటాను 65 శాతానికి సవరించింది
Big Jolt to Nitish Kumar: బిహార్‌లో నితీష్‌కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది నవంబర్‌లో రిజర్వేషన్ చట్టాన్ని సవరించి మొత్తం రిజర్వేషన్ కోటాను 65 శాతానికి సవరించింది నితీష్ సర్కార్. కాగా నితీష్ సర్కార్ వెనుకబడిన తరగతులు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు.. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యలో కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచారు. కాగా ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్‌ను పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ కొట్టి వేసింది.
ఇదిలా ఉండగా బిహార్ ప్రభుత్వం రెండు రిజర్వేషన్ బిల్లుల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో ఎస్‌సీ, ఎస్‌టి, ఈబీసీ, ఓబీసీలకు బిహార్ రిజర్వేషన్ ఆఫ్ వెకెన్సీస్ కింద ప్రభుత్వ ఉద్యోగాలల్లో రిజర్వేషన్ కల్పించింది. అలాగే విద్యాసంస్థలు, ఇన్సిస్టిట్యూషన్స్‌లో రిజర్వేషన్ సవరణ బిల్లు -2023లో రిజర్వేషన్‌ను 50 శాతం నుంచి 65 శాతానికి సవరించారు. దీంతో పాటు ఆర్థికంగా వెనుకబడి వర్గాలకు 10 శాతం కోటా కలుపుకుంటే మొత్తం 65 శాతం నుంచి 75 శాతానికి చేరుతుంది.
కులాల ప్రాతిపదికన..(Big Jolt to Nitish Kumar)
ఇక రాష్ర్టంలో నితీష్ సర్కార్ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఎస్‌సీ కోటాలో 20 శాతం… షెడ్యూలు తెగలకు రెండు శాతం. ఈబీసీలకు 25 శాతం, ఓబీసీలకు 18 శాతం చొప్పున పెంచారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కులగణనలో రాష్ర్టంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూలు కులాలు, తెగలకు రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించింది. రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన అవకాశాలు కల్పించాలని, సమాజంలో వెనుకబడిన వారికి ప్రయోజనం కలిగించేందుకు రిజర్వేషన్‌లను పెంచాలని నిర్ణయించినట్లు నితీష్ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్‌లో వివరించింది.
కాగా నితీష్ ప్రభుత్వం భారీగా రిజర్వేషన్ కోటాను పెంచడంతో .. రాష్ర్టప్రభుత్వం తమకు చట్ట ప్రకారం సంక్రమించిన అధికారం కంటే మించి ఎక్కువ మొత్తం రిజర్వేషన్ ప్రకటించిందని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బిహార్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కోటాను పెంచిందని చెప్పారు. కాగా సుప్రీంకోర్టులో ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసుకు సంబంధించి జరిగిన వాదప్రతివాదనల ప్రకారం ఏదైనా కోటా లేదా రిజర్వేషన్ 50 శాతం దాటవద్దని తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం కోటా పెంచితే పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లు అని పిటిషనర్ కోర్టుకు సమర్పించిన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.