Telangana Govt: కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారం: భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka: పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో మధిరలో పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదల బాధలను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో మొదటి ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో 1.20కోట్ల కుటుంబాలు ఉన్నాయని, 93లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. రూ.8వేల కోట్లతో నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. రైతుభరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.17,500 కోట్లు చెల్లించిదన్నారు. రూ.లక్ష కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం మధిర పట్టణ ప్రగతిలో మరో కీలక మైలు రాయిగా నిలిచే రూ.6.45 కోట్లతో చేపట్టిన మధిరలోని అంబారుపేట పెద్ద చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.