Published On:

TG Govt. on Kancha Gachibowli: ఆ 400 ఎకరాలు పూర్తిగా సర్కార్ ల్యాండే.. సుప్రీంకు అఫిడవిట్ సమర్పణ..!

TG Govt. on Kancha Gachibowli: ఆ 400 ఎకరాలు పూర్తిగా సర్కార్ ల్యాండే.. సుప్రీంకు అఫిడవిట్ సమర్పణ..!

Telangana Government Submitted Affidavit to the Supreme Court on Kancha Gachibowli 400 acres: కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల ల్యాండ్ తెలంగాణ సర్కారుదేనని, అది అటవీ భూమి కాదని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఈ ల్యాండ్ ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేదని పేర్కొంది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర సర్కారు బుల్డోజర్ల ద్వారా ఆ ల్యాండ్‌ను చదును చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కేసును సుమోటోగా విచారించి వెంటనే అక్కడి కార్యలాపాలపై స్టే విధించడంతోపాటు 5 అంశాలకు సమాధానమిస్తూ ఈ నెల 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

 

1. అటవీ భూమిగా చెబుతున్న ప్రాంతంలో చెట్లను కొట్టేయడంతోపాటు ఇతరత్రా అభివృద్ధి కార్యకలాపాలకు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని ప్రశ్రించింది.

 

2. రాష్ట్ర సర్కారు ఎంచుకున్న అభివృద్ధి కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావ మదింపు ధ్రువపత్రం ఉందా? అని పేర్కొంది.

 

3. చెట్ల నరికివేతకు అటవీ, ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు ఉన్నాయా? అని అడిగింది.

 

4. సుప్రీం ఉత్తర్వులతో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేని అధికారులను ఎందుకు నియమించారు? అని ప్రశ్నించింది.

 

5. ఇప్పటివరకు కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిర్దేశించడంతో రాష్ట్ర సర్కారు అందుకు అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేసింది.

 

అది ఎప్పుడూ అటవీ భూమిగా లేదు..
ఆ 400 ఎకరాలు ఎప్పుడూ అటవీ భూమిగా లేదని, పూర్తిగా సర్కారు భూమి అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగడంతో ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగాయని, ప్రభుత్వ కార్యకలాపాల విస్తరణకు ఇది ఉత్తమమైన ప్రాంతంగా పేర్కొంది. ఈ భూమిపై ఎలాంటి వివాదం లేదని తెలిపింది. ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందిని పేర్కొంది. ఈ ల్యాండ్ ఓపెన్‌గా ఉండటంతోనే చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చిపోతున్నాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇదీ కలిపి ఉన్న 2వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతూంటాయి తప్ప ఇక్కడ వాటికి అవాసం లేదని తేల్చి చెప్పింది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక వాటికి ఇబ్బంది కలిగించకుండా చర్యలు చేపడుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావని, అవసరం అయితే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలను పెంచుతామని ప్రభుత్వం వివరించింది.

 

ఇవి కూడా చదవండి: