Published On:

Ponguleti Sensational Comments on KCR: కేసీఆర్‌పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దత్తత పేరుతో వాసాలమర్రి ఆగం..!

Ponguleti Sensational Comments on KCR: కేసీఆర్‌పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దత్తత పేరుతో వాసాలమర్రి ఆగం..!

Ponguleti Srinivasa Reddy Sensational Comments on KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో అర్హులైన 205 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాటల మాంత్రికుడు కేసీఆర్ అన్నారు. వాసాలమర్రికి చేసిందేమీ లేదని, దత్తత పేరుతో ఆగం చేశారన్నారు. పదేళ్లల్లో పేదవాల్లకు బొమ్మలు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. బొమ్మలు చూపించి ఓట్లు వేసుకున్నారని విమర్శలు చేశారు.

 

పేదల కల నెరవేర్చడమే మా లక్ష్యమని పొంగులేటి అన్నారు. వాసాలమర్రి గ్రామాన్ని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆగమాగం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఆనాడు గ్రామస్తులతో కేసీఆర్ సంహపంక్షి భోజనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆగవ్వ వృద్ధురాలితో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. అయితే ఆగవ్వను పలకరించగా.. ఆమె మాటలు వింటుంటే ఎంతో బాధ కలిగిందన్నారు. కేసీఆర్ మాటలు నమ్మి ఆగవ్వతో పాటు వాసాలమర్రి గ్రామస్తులు ఆగమమయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇక, ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. వాసాలమర్రిని అన్ని విధాలుగా ఆదుకుంటూ అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. వాసాలమర్రి లాగానే ఇళ్లు ఇస్తామంటూ బొమ్మను చూపి ఓట్లు వేయించుకున్న కేసీఆర్.. ఏ ఒక్క ఊరికి ఇళ్లు ఇవ్వకుండా రాష్ట్రాన్నిదిక్కు లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి నెట్టినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికలల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.

 

భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణపనులు మొదలు పెట్టడానికి డబ్బులు కూడా లేవని ఆగవ్వ చెప్పడంతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే రూ. లక్ష అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మంత్రి అభినందనలు తెలిపారు.