Brahmos Missile Unit Expansion: రాష్ట్రంలో బ్రహ్మోస్ యూనిట్

Brahmos Aerospace Expansion: రక్షణ రంగానికి చెందిన కీలక ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణుల ప్రాధాన్యత ఏంటో తెలిసిన తరుణంలో మిస్సైళ్ల ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా బాలానగర్ లో ఇప్పటికే మిస్సైల్ తయారీ కేంద్రం ఏర్పాటైంది. దీన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.
మరోవైపు ఢిఫెన్స్ కారిడార్ ను విస్తరించేందుకు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకే బ్రహ్మోస్ సంస్థను విస్తరించాలని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో బ్రహ్మోస్ సంస్థ ప్రతినిధులు సంస్థ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చౌదర్ పల్లి, బస్వాయిపల్లి గ్రామ శివారులో భూములను పరిశీలించారు. సంస్థ ప్రతినిధులకు తోడుగా స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు.
ఈ ప్రాంతంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్, అనుబంధ సంస్థలకు అనుకూలంగా ఉంటుందని భావించారు. మరోవైపు జాతీయ రహదారులు 44, 167 కూడా దగ్గర్లో ఉండటంతో రవాణా కూడా సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుత స్థల పరిశీలన ప్రాంతంలో బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటైతే ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చేందనుంది. ఈ యూనిట్ కు అనుబంధంగా పలు పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరకనుంది.