Yoga Day 2025: మోదీ సమక్షంలో యోగాతో గిన్నీస్ రికార్డు.!

యోగాతో గిన్నీస్ బుక్ రికార్డు సాధించడానికి విశాఖపట్నం సిద్దమైంది.
Yoga Day 2025: దేహాన్ని చైతన్యపరిచి, మనసుకు ఉత్తేజాన్ని కల్గించేది యోగా. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ఈ ప్రాచీన విద్య పరమావధి. ఈ అపూర్వ యోగ విద్యను సామాన్యుల దగ్గరికి చేర్చుతున్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకుతీసుకెళ్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహా ప్రదర్శనకు సాగర నగరం సిద్దమయ్యింది.
ఆంధ్రనాట జూన్ 21న యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాన్యుల చెంతకు చేర్చడమే లక్ష్యంగా నెల రోజులపాటు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో యోగా శిక్షణ పూర్తయ్యింది. రేపు అనగా జూన్ 21న విశాఖ సముద్ర తీరాన సుమారు 5 లక్షలమందితో యోగా ప్రదర్శన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది . ఈ మెగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, ప్రజలు భాగస్వాములు కానున్నారు.
విశాఖ బీచ్‌రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి భీమునిపట్టణం వరకు మొత్తం 26 కిలోమీటర్ల మేర యోగా ప్రదర్శనను నిర్వహిస్తారు. ఇందుకోసం మొత్తం 326 కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో తాగునీరు, 100 మందికి ఒకటి చొప్పున మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. స్టెచర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, స్నాక్స్ బాక్సులు సిద్దంగా ఉంచారు. ప్రదర్శనలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ యోగా మేట్, టి షర్ట్ పంపిణీ చేస్తున్నారు. యోగా ప్రదర్శన అనంతరం సాధనకులు వీటిని తీసుకువెళ్లిపోవచ్చని చెప్పారు. కంపార్ట్‌మెంట్లో ప్రవేశించడానికి, బయటకు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశారు. అందరికీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
అవసరమైన అత్యవసర మందులు, 104 వాహనాలతో పాటు ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒక 5 పడకల ఆసుపత్రిని సిద్దం చేశారు. 10,000 మందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 26 కిలోమీటర్ల సాగర తీరంతో పాటుగా మరో 18 క్రీడా మైదానాల్లో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏయూ మైదానం, చినగదిలి గోల్ఫ్ క్లబ్, పిఎం పాలెం క్రికెట్ స్టేడియం, కొమ్మాది స్టేడియం, ఫోర్ట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం తదితర 18 క్రీడా మైదానాలు, మరో 30 అదనపు ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు.