Last Updated:

MP DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు

MP DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు

MP DK Aruna : బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 56లో ఆమె నివాసం ఉంటున్నారు. ఇశాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని, ముఖానికి మాస్క్‌ ధరించి ఇంట్లోకి చొరబడడ్డాడు. గంటన్నర పాటు ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ఇవాళ తెల్లవారు జామున 3 గంటలకు ఇంట్లో శబ్దం వచ్చింది. కానీ, ఎవరూ కనిపించలేదు. కిచెన్‌లో పాదముద్రలు ఉన్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ చూడగా, ఓ వ్యక్తి వంటగది వైపు కిటికీలో నుంచి వచ్చినట్లు కనిపించింది. మాస్క్‌, గ్లౌజులు వేసుకొని ఉన్నాడు. ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. మీటింగ్‌ కోసం శనివారం మహబూబ్‌నగర్‌ వెళ్లారు. ఆగంతకుడు గంటన్నర పాటు కిచెన్‌లో ఉన్నాడు. ఎంపీ గది వరకు వెళ్లాడు. ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు. ఒక్కడే వచ్చినట్లు సీసీ టీవీలో కనిపించింది. జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని డీకే అరుణ డ్రైవర్‌ లక్ష్మణ్ తెలిపారు.

 

 

సెక్యూరిటీ పెంచాలి : డీకే ఆరుణ
హైదరాబాద్‌లోని తన నివాసంలోకి దుండగుడు చొరబడిన ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. తనతో పాటు తన కుటుంబానికి సెక్యూరిటీ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో తమ కుటుంబంపై జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: