Medigadda Barrage Bridge: కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన
కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజి అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకీ 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19, 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది.
Medigadda Barrage Bridge:కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజి అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకీ 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19, 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది. బీముల వెయిట్ పడుతుండటంతో మరో రెండు పిల్లర్లపై కూడా భారం పడుతోంది. లక్ష్మీ బ్యారేజ్ వద్ద రాకపోకలు నిలిపివేసి సైరన్ వేస్తూ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
భద్రతా చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు..(Medigadda Barrage Bridge)
అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఇరువైపులా మట్టి కుప్పలు పోస్తూ ఎవరు రాకుండా పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించారు. ప్రస్తుతం బ్రిడ్జిపైనుండి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మహారాష్ట్రకి తెలంగాణకి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇంజినీరింగ్ అధికారులు దీనిపై స్పందించలేదు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్రత్యేక నిపుణుల బృందం వస్తుంది..
డ్యాం ఏ కారణంతో కృంగిందో ఇంకా పరిశోధన చేస్తున్నామని చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు చెప్పారు. హైదరాబాద్‌నుండి ప్రత్యేక నిపుణుల బృందం కూడా వస్తుందని వెంకటేశ్వర్లు తెలిపారు. 20వ నంబర్ పిల్లర్ వద్ద ఒకటిన్నర అడుగుల మేర డ్యాం కృంగిందని వెంకటేశ్వర్లు చెప్పారు. డ్యాం సింకింగ్ పెద్ద సమస్య కాదన్న చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు నిన్న రాత్రి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని వివరించారు. ప్రజల సేఫ్టీ కోసమే ఎవరినీ అనుమతించలేదని, ప్రభుత్వ ఒత్తిడి తమపై లేదని చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుంది..
మేడిగడ్డ బ్యారేజిని ఎల్ అండ్ టి ఇంజినీర్ సురేష్ కుమార్ సందర్శించారు. ఆయనతోపాటు బ్యారేజి దెబ్బ తిన్న ప్రాంతాన్ని డిజైన్ టీమ్, ఇంజినీర్ టీమ్ పరిశీలించింది. భారీ శబ్దం వచ్చిన తరువాత బ్లాక్ సెవెన్‌లో కుంగిందని తేల్చారు. నీటి లెవెల్స్ తగ్గాక ఏం జరిగిందో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. డ్యాంకి ఏం జరిగినా ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుందని ఇంజినీర్ సురేష్ కుమార్ చెప్పారు. ప్రజలకు, వాతావరణానికి ఎలాంటి హానీ కలగనివ్వబోమని సురేష్ కుమార్ తెలిపారు.